తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) రూపొందించిన 2020 క్యాలెండర్లను తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.100 విలువగల 12 పేజీల క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15 విలువగల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, రూ.15 విలువగల శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10 విలువగల శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, అదేవిధంగా రూ.20 విలువగల తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2 లక్షలు, రూ.60 విలువగల టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు ముద్రించామని వివరించారు.
వీటితో పాటు రూ.130 విలువగల పెద్ద డైరీలు 6 లక్షలు, రూ.100 విలువ గల చిన్నడైరీలు 1.50 లక్షలు ఉన్నాయని తెలిపారు. డిసెంబరు మొదటి వారం నుంచి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, న్యూఢిల్లీ, ముంబైలోని టిటిడి సమాచార కేంద్రాల్లో, టిటిడి కల్యాణ మండపాల్లో క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
డిసెంబరు రెండో వారం నుండి డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో జెఈవో పి.బసంత్‌కుమార్, టిటిడి బోర్డు సభ్యులు మోరంశెట్టి రాములు, శివకుమార్, ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకరరెడ్డి, గోవిందహరి, ప్రెస్ డెప్యూటీ ఈవో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.