కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించామని.. ఇందులో భాగంగా మే నెల 31వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టిటిడి అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఙాన పీఠంలో గల ప్రార్థనా మందిరంలో శనివారం అఖండ పారాయణం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో ఈఓ మాట్లాడుతూ హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 16గంటల పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగు బృందాల్లో 40మంది పండితులు పారాయణం చేసేందుకు వీలుగా ఇక్కడ ప్రార్థనా మందిరంలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు.
హోమం ఏర్పాటు చేసి ప్రతి శ్లోకం తరువాత హవనం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇళ్ళ నుంచే ఎస్వీబీసీలో తిలకించవచ్చునన్నారు. అలాగే టివీలో చూసేటప్పుడు టీవీ సౌండ్ పెంచడం ద్వారా మంత్రపూర్వకమైన శ్లోకాల శబ్ధ తరంగాలు వాతావరణంలో కలిసి శ్రీవారి అనుగ్రహం కలుగుతుందన్నారు.
అఖండ సుందరకాండ పారాయణం కారణంగానే 31వ తేదీన శ్రీవారి కళ్యాణోత్సం, సహస్ర్త దీపాలంకరణ సేవను మాత్రమే ఎస్వీబీసీలో స్ల్పిట్ చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తారని.. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిగతా కార్యక్రమాల ప్రసారాలను రద్దు చేస్తున్నామన్నారు.