కృష్ణపట్నంలో కరోనా నిరోధించేందుకు ఆనందయ్య నాటు మందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల బాదుడు దెబ్బ ఒకవైపు, ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఇంకోవైపు కలిసి కొందరు నాటు మందును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆనందయ్య మందుకు బీభత్సమైన ప్రచారం జరగడంతో అక్కడకు ఒక్కసారిగా వేలమంది మందు కోసం పరుగులు తీసారు.
ఐతే ఆ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందని కొందరు అంటుంటే మరికొందరు ఆ మందు దుష్ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 80 మంది నాటు మందు తీసుకున్న కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా కళ్లు మంటలు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఆసుపత్రుల్లో చేరారు.
ఈ నేపధ్యంలో ఆనందయ్య మందు ఎంతమేరకు పనిచేస్తుందన్నది నిగ్గు తేల్చాలని సిపిఎ డిమాండ్ చేస్తోంది. నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని వాకబు చేసారు. ప్రభుత్వం ఇస్తున్న చికిత్సలపై నమ్మకం లేకనే ప్రజలు ఇలా నాటుమందులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు.