ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో తొలిసారి వెలుగు చూసింది కేరళ రాష్ట్రంలోనే. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ప్రతి రోజూ సుమారుగా 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కోలుకున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇలాంటి వారికి కేరళ సర్కారు కొత్త ఆంక్షలు విధించింది. కొవిడ్-19 వైరస్ సోకి తిరిగి కోలుకున్న వారు శబరిమలకు రావొద్దని కేరళ సర్కారు విజ్ఞప్తి చేస్తోంది.
కోలుకున్న వారిలో మూడు వారాల నుంచి మూడు నెలల దాకా వైరస్ ప్రభావం ఉంటుందని, శ్వాస ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని చెబుతోంది. అలాంటి వారు శబరి కొండను ఎక్కేప్పుడు ఆక్సిజన్ తగ్గడం వల్ల ఇబ్బంది పడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. పల్మనాలజిస్టుల మార్గదర్శనంలో శారీరక వ్యాయామం చేసి, శ్వాస సమస్యలు లేవని నిర్ధారణ అయితే.. జాగ్రత్తలు తీసుకుంటూ శబరికి రావొచ్చని పేర్కొంది.
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి మండల పూజ సీజన్ ప్రారంభంకావడం.. డిసెంబరు చివరి నుంచి మకరవిలక్కు దర్శనాలకు అనుమతించడంతో.. శబరిమల యాత్రికుల కోసం సోమవారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో ప్రధానంగా భక్తులు మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తూ.చ. తప్పకుండా పాటించాలని సూచించింది. దర్శనానికి 24 గంటల ముందు నెగటివ్ రిపోర్టు ఉండాలని తెలిపింది.