కరోనా వేళ వలస కార్మికులకు భారత్ స్కౌట్స్ , గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సహాయపడ్డారన్నారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో భారత్ స్కౌట్స్, గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం నిర్వహించారు.
ఎపి అసోసియేషన్ ఆఫ్ భారత్ స్కౌట్స్, గైడ్స్ ప్రధాన పోషకునిగా ఉన్న గవర్నర్ శ్రీ హరిచందన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2000 నవంబర్‌లో జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకల నుండి భారత్ స్కౌట్స్, గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జెండా దినోత్సవంగా కూడా పాటిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యకలాపాలకు ప్రచారం కల్పించటంతో పాటు, సంస్థ యొక్క అభివృద్ధికి మద్దతును ఆశిస్తూ సాధారణ ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇటువంటి సందర్భాలు అవకాశం కల్పిస్తాయన్నారు. ఆరోగ్యం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడటం వంటి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ శ్రీ హరిచందన్ భారత్ స్కౌట్స్, గైడ్స్ సభ్యులకు సూచించారు.
పతాక దినోత్సవ నిధికి తన వ్యక్తిగత సహకారాన్ని అందించిన గవర్నర్ హరిచందన్, ఈ నిధికి ఉదారంగా సహకరించాలని, భారత్ స్కౌట్స్, గైడ్స్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించిన భారత్ స్కౌట్స్ , గైడ్స్ కార్యకలాపాల సిడిని గవర్నర్ విడుదల చేశారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పాఠశాల విద్య సంచాలకులు, రాష్ట్ర స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్ చిన వీరభద్రుడు, భారత్ స్కౌట్స్, గైడ్స్ రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.