ప్రముఖ ప్రవచనకర్త చాంగటి కోటేశ్వర రావు గారివల్లే తిరువణ్ణామలైలోని శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో తెలుగు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని సినీ నటుడు శివాజీ రాజా అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో అక్కడ ప్రశాంత వాతావరణం దెబ్బతిందన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అరుణాచలం వెళ్లే భక్తులు కొందరు ఫోటోలు, వీడియోలో వ్లాగ్స్ అంటూ అక్కడి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'అరుణాచలం గురించి ఎక్కువ మందికి తెలియక ముందు నుంచే, గత 30 ఏళ్లుగా నేను నా కుటుంబంతో కలిసి వెళ్తున్నాను. మేం చాలా నిరాడంబరంగా దండం పెట్టుకుని వస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల తర్వాత తెలుగు భక్తుల రద్దీ పెరిగింది. అయితే, వీరిలో 75 శాతం మంది భక్తితో వస్తుంటే, మిగతా 25 శాతం మంది మాత్రం అరుణాచలాన్ని ఒక వెకేషన్ ట్రిప్‌లా భావిస్తున్నారు. వాళ్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే" అని అన్నారు.
రమణాశ్రమం వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కూడా కొందరు సెల్ఫీల కోసం అల్లరి చేస్తున్నారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. "ఒకసారి నేను, నటుడు రాజా రవీంద్ర వెళ్లినప్పుడు కొంతమంది ఫొటోల కోసం గట్టిగా అరుస్తుంటే, అక్కడున్న విదేశీయులు వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారు. వెంకటేశ్, ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. కానీ కొందరి ప్రవర్తన అక్కడి పవిత్రతను దెబ్బతీస్తోంది. ఇది చూసి మనసుకు చాలా బాధగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం శివాజీ రాజా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా, చాలా మంది నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.