Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొగిలీశ్వరుడిని పూజిస్తే.. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే?

Advertiesment
Sri Mogileswara Swamy
, గురువారం, 28 మార్చి 2019 (16:22 IST)
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ హరిహర క్షేత్రంగా పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం మొగిలి. మొగిలీశ్వరుడు అక్కడ కొలువైనాడు. భక్తులు తడిబట్టలతో స్నానం చేసి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తే తప్పకుండా కోర్కెలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.


ఈ ప్రదేశంలోనే కాక దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మొగిలీశ్వరుడి పేరున్న వ్యక్తులు చాలా మంది మనకు కనిపిస్తారు. చుట్టూ కొండల మధ్య కనువిందైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా ముక్కంటి అక్కడ వెలిశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. 
 
హరితోపాటు కొలువైనందున అది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. గోపాలుడు రుక్మిణీ, సత్యభామ సమేతంగా కొలువై ఉండటం మొగిలి ప్రత్యేకత. దేశంలో ఏ హర క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ భక్తులను పూజారులు శఠగోపంతో ఆశీర్వదిస్తారు. సర్పదోష నివారణ కోసం రాహు కేతు పూజలు చేయించుకునేవాళ్లు ఈ ఆలయంలో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. పూర్వం మొగలిపొదల సమీపంలో గల మొగిలివారిపల్లి గ్రామంలో పేద బోయ దంపతులు నివసించేవారు. 
webdunia
 
బోయ భార్య నిండు చూలుతో ఉన్నపుడు ఒకరోజు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు వచ్చి అక్కడే బిడ్డను ప్రసవించింది. మొగలిపొదల వద్ద పుట్టాడు కనుక మొగిలప్ప అని ఆ బిడ్డను అందరూ పిలవసాగారు. మొగిలప్పకి యుక్తవయస్సు వచ్చాక ఒక పెద్ద రైతు ఇంట్లో పశువులను మేపే పనికి కుదిరాడు. ఒకరోజు మొగిలప్ప అడవిలోకి పశువులను తోలుకెళ్లి సమీపంలోని మొగలిపొదల వద్ద వాటిని వదిలి, వంటచెరకు కోసం పొదలను నరకసాగాడు. కొద్దిసేపటికి కంగుమని శబ్దం వచ్చి రక్తం కారసాగింది. '
 
ఆ పొదలను తొలగించి చూడగా అక్కడ రక్తం ధారగా పారుతున్న శివలింగం కనిపించింది. మొగిలప్ప వెంటనే ఆ లింగానికి కట్టుకట్టాడు. అప్పటి నుండి పూలు, పండ్లు సమర్పించి పూజించసాగాడు. ఇంటి ధ్యాస కూడా మరిచిపోవడంతో మొగిలప్ప తల్లి కలవరపడింది.

వెంటనే మొగిలప్పకు వివాహం చేసింది. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. మొగిలప్ప మేపుతున్న గోవులలో ఒకటి పాలివ్వకపోవడంతో రైతు అతడిని మందలించాడు. మరునాడు మొగిలప్ప గోవుపై కన్నేశాడు. మేపుకు వెళ్లినప్పుడు దానిని వెంబడించాడు. దేవరకొండ వైపు వెళ్లి అక్కడ ఉన్న బిలంలో ప్రవేశిస్తుండగా దాని తోకను పట్టుకొన్నాడు. అతనూ గోవుతోపాటు చాలా దూరం ప్రయాణించాడు.
 
ఇద్దరూ ఒక విశాల ప్రదేశానికి చేరుకోగా అక్కడ జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్రను చేబూని, ఆ గోవును సమీపించి పాలు పితికింది. మొగిలప్ప అనుమతి లేకుండా ప్రవేశించినందుకు మాత శపించబోయింది. మొగిలప్ప శరణు వేడుకోవడంతో ఆకలిదప్పులు లేకుండా వరం ఇచ్చింది. విషయం ఎవరికైనా చెబితే మరణిస్తావని హెచ్చరించింది. ఆ తర్వాత మొగిలప్ప ఇంటికి చేరుకున్నాడు. నాటి నుండి నిద్రాహారాలు మాని శివధ్యానంలో మునిగిపోయేవాడు. భార్య ఎంత అడిగినా విషయం చెప్పలేదు. 
 
భార్య చివరికి చనిపోతానని బెదిరించడంలో చేసేదేమీ లేక ఊరి పొలిమేరల్లో చితి పేర్చుకొని, ఊరందరినీ పిలిచి విషయం చెప్పాడు. మరుక్షణం మరణించాడు. మొగిలప్ప భార్య పశ్చాత్తాపంతో సహగమనం చేసింది. మొగిలప్ప చితి ఉన్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా పిలుస్తుంటారు. మొగిలప్ప పేరుమీదుగానే శివలింగాన్ని మొగిలీశ్వరుడు అని పిలవసాగారు. 
webdunia
 
సంతానం లేనివారు ఆలయంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కనీసం వంద వరకు వివాహాలు జరుగుతుంటాయి. అమావాస్య నాడు భక్తులు ఆలయంలో పోటెత్తుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరమట..