Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగనకొండ మహాత్మ్యం.. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే?

సింగనకొండ మహాత్మ్యం.. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే?
, సోమవారం, 26 ఆగస్టు 2019 (18:27 IST)
ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం సింగరకొండ. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. శింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు ఒడ్డున ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం అయినా కూడా ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచింది. 
 
సింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెబుతారు. 
 
ఈ క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి, 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజూ ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటీ రెండు రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు కానీ, కొద్ది రోజుల నుండి ఆవు పాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటని ఆలోచించాడు. అసలు విషయాన్ని కనిపెట్టడానికి పాలు ఇవ్వని ఆవును అనుసరిస్తూ వెళ్ళాడు.
 
ఆ ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ రాతిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవుపాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు. స్వయంగా తన కళ్ళతో రాతిలో నుండి బాలుడు రావడం చూశాడు కనుక, ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నృసింహ స్వామికి దేవాలయం కట్టించాడు.
 
ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి కూడా స్థల పురాణం ఉంది. తమ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. 
 
అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియందు ధ్వజారోహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.
 
సింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహా యోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. 
webdunia
 
మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-08-2019- సోమవారం రాశి ఫలితాలు..