30 ఇయర్స్ పుణ్యమా అని ఆ పదవిని ఖాళీగా ఉంచే యోచనలో సిఎం.. ఎందుకంటే..?

శనివారం, 25 జనవరి 2020 (20:01 IST)
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ఛైర్మన్ పదవికి సంబంధించి ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్థమైంది. ఆ ఛానల్‌ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించాలని నిర్ణయించడానికి ఎపి సిఎం సిద్థమవుతున్నారట.

ఎస్వీబీసీ ఛానెల్‌ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆ బాధ్యతలను ధర్మారెడ్డికి  అప్పగించాలని భావించిందట. అంతేకాకుండా ఛానెల్ ఛైర్మన్ పదవిని ఖాళీగా ఉంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఛానెల్‌కు అదనంగా మరో రెండు డైరెక్టర్ల పదవులు నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా టాలీవుడ్ కమెడియన్, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌‌ను నియమించారు. కానీ ఆయన ఛానెల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు బయటపడ్డాయి. అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. తనపై ఆరోపణలు రావడంతో పృథ్వీరాజ్‌‌ తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు టీటీడీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
 
గతంలో ఎస్వీబీసీ బోర్డు ఏర్పాటైన తర్వాత ఎండీ పోస్టులో టీటీడీ కార్యనిర్వహణాధికారి ఉండేవారు. ప్రభుత్వం నియమించిన చైర్మన్‌కే ఎండీ బాధ్యతలనూ అప్పగిస్తూ వస్తున్నారు. టీడీపీ  హయాంలో ఛానెల్ బాధ్యతల్ని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చూసేవారు. సర్కార్ మారడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఫృద్వీరాజ్ ను వరించినా ఆయన మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 26-01-2020 నుంచి 01-02-2020 వరకు మీ వార రాశి ఫలితాలు..