తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ఇప్పటివరకు ఉన్న నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మార్పులు చేసింది. ఇకపై అద్దె గదుల బుకింగ్‌లో క్యాష్ ఆన్ డిపాజిట్ విధానాన్ని తక్షణం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది.
ఇందులోభాగంగా ఆన్‌లైన్ మాధ్యమంలో గదిని బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.
ఇకపోతే, ఆఫ్‌లైన్‌లో అంటే, తిరుమలకు వచ్చి అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది.
కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి తీసుకొచ్చింది.