''శ్రీరామజయరామ జయజయరామ'' అని పలికితే..?

గురువారం, 1 నవంబరు 2018 (15:09 IST)
రామ అనే శబ్ధం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. రామ శబ్దాన్ని విడిగా చూస్తే ర+ఆ+మ అనే మూడు బీజాక్షరాల కలయికగా కనిపిస్తుంది. ఇందులో ''ర'' అగ్నిబీజాక్షరం, "'ఆ" సూర్యబీజాక్షరం, ''మ" చంద్రబీజాక్షరం. అగ్ని బీజాక్షరమైన ''ర'' కర్మలను నశింపచేసి మోక్షాన్ని ఇస్తుంది.


సూర్య బీజాక్షరమైన "ఆ'' మోహాంధకారాలను పోగొడుతుంది. చంద్రబీజాక్షరమైన "మ'' తాపత్రయాలను హరిస్తుంది. రామనామశక్తి ఇంత గొప్పది. అలాగే ర, ఆ, మ మూడు త్రిమూర్తులకు ప్రతీకలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆ త్రిమూర్తులు. అలా చూస్తే రామనామ జపం సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురి కృపను పొందటానికి వీలుంటుంది.
 
ఇంకా రామ నామ గొప్పతనం గురించి చెప్పే కథొకటి ప్రచారంలో వుంది. అదేంటంటే? రావణ వధానంతరం రాముడు అయోధ్యను రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్నాడు. కష్టాలను పోగొట్టేందుకు తగిన మంత్రాన్ని ఆవిర్భవింపచేసే దిశగా నారదుడు ఆలోచించసాగాడు. అప్పుడాయనకు ఓ ఆలోచన తట్టింది. ఓ రోజున శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. 
 
ఆ కొలువులో శ్రీరాముడి గురువు విశ్వామిత్రుడు రాముడి బంటు హనుమంతుడు కూడా ఉన్నారు. నారదుడు కొలువు ప్రారంభానికి ముందు హనుమ దగ్గరకు వెళ్లి అందరినీ నమస్కరించమంటాడు. విశ్వామిత్రుడిని మాత్రం నమస్కరించవద్దంటాడు. 
 
నారదుడి మాట విని హనుమంతుడు కూడా విశ్వామిత్రుడిని నమస్కరించడు. ఆ తర్వాత నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి అందరినీ గౌరవించిన హనుమ నిన్ను గౌరవించలేదు కనుక రాముడికి చెప్పి శిక్షపడేలా చేయమని అన్నాడు. విశ్వామిత్రుడు నారదుడి మాయమాటల్లో పడి రాముడికి హనుమ ప్రవర్తన బాగాలేదని మరుసటి రోజు సాయంత్రంలోపల మరణదండన విధించమన్నాడు.
 
హనుమ సభ ముగియగానే నారదుడి దగ్గరకొచ్చి ఆ సంకటస్థితి నుంచి బయటపడేలా చేయమన్నాడు. అప్పుడు నారదుడు మరుసటి రోజు సూర్యోదయం కంటే ముందు లేచి సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రాన్ని జపించు, అన్ని కష్టాలు అవే తొలగిపోతాయి అని చెప్పాడు. హనుమ అలాగే చేశాడు. మరునాడు రాముని కొలువుకు వెళ్లాడు. అక్కడ విశ్వామిత్రుడు బాణాలు ఎక్కుపెట్టాడు. 
 
కానీ నిరంతరం శ్రీరామ జయరామ జయజయరామ అని నామజపం చేస్తున్న హనుమను ఆ బాణాలేవీ తాకలేకపోయాయి. వెంటనే నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి తాను భగవంతుడికన్నా భగవన్నామమే గొప్పదని నిరూపించేందుకు, మానవాళికి పుణ్యాన్ని ప్రసాదించే మహామంత్రాన్ని ఆవిర్భవింపచేసేందుకు తానే అలా ఓ చిన్న నాటకాన్ని ఆడానని చెప్పాడు. 
 
ఆపై విశ్వామిత్రుడు రామ నామ గొప్పదనం కోసం నారదుడు డ్రామా చేశాడని తెలుసుకుంటారు. అలా ''శ్రీరామజయరామ జయజయరామ'' అనే గొప్ప మంత్రం ఆవిర్భవించిందని పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలో తెలుసా..?