Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త శవయాత్ర.. యువతిని లేవనెత్తి సుమంగళిగా జీవించమని?

హనుమాన్ చాలీసాను శనివారం ఉదయం శుచిగా స్నానమాచరించి.. పఠించాలి. ఇలా శనివారం పూటనే కాకుండా.. ప్రతిరోజూ ఉదయం నిష్ఠతో హనుమంతుడిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అయితే హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడ

Advertiesment
భర్త శవయాత్ర.. యువతిని లేవనెత్తి సుమంగళిగా జీవించమని?
, శుక్రవారం, 19 అక్టోబరు 2018 (15:32 IST)
హనుమాన్ చాలీసాను శనివారం ఉదయం శుచిగా స్నానమాచరించి.. పఠించాలి. ఇలా శనివారం పూటనే కాకుండా.. ప్రతిరోజూ ఉదయం నిష్ఠతో హనుమంతుడిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అయితే హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. 
 
రామభక్తుడైన తులసీదాసు నాటి వాడుక భాషైన అవధి యాసలో హనుమంతునిపై ఆశువుగా చెప్పిన 40 దోహాల సమాహారమే హనుమాన్ చాలీసా. హనుమ జీవన విశేషాలు, సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిత్వపు గొప్పదనాలను క్లుప్తంగా, ఆకట్టుకొనేలా తులసీదాసు ఇందులో అద్భుతంగా వర్ణించారు. వందలాది ఏళ్లుగా భక్తుల పాలిట కల్పవక్షంగా ఇది పరిగణించబడుతోంది.
 
పూర్వం పవిత్ర క్షేత్రమైన వారణాసి పట్టణంలో క్రీ.శ 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాసు అనే సాధువు ఉండేవారు. నిరంతరం రామనామ స్మరణ చేసే ఆయనను.. అపర వాల్మీకిగా భావించేవారు. పామరులకు అర్థమయ్యే విధంగా ''రామ చరిత మానస్'' పేరిట రామ చరితను ఈయన రచించారు. 
 
తులసీదాసు రచనల, బోధనల ప్రభావం వల్ల ఎందరో అన్యమతస్తులు రామభక్తులయ్యారు. ఈ మార్పు ముస్లిం మతపెద్దలకు కంటగింపుగా మారటంతో వారు తులసీదాస్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని చక్రవర్తి అక్బర్‌కు ఫిర్యాదులు అందాయి.
 
కొంతకాలానికి.. వారణాశిలో దయళువుగా పేరున్నధనికుడు తన ఏకైక కుమారునికి చక్కని కన్యతో వివాహం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ వివాహమైన కొద్దిరోజులకే ఆ ధనికుడి కుమారుడు తిరిగి లోకాలకు వెళ్ళిపోయాడు.
 
అంత్యక్రియలకు అతని మృతదేహాన్ని బంధుమిత్రులు స్మశానానికి తీసుకుపోతుండగా, భర్త మరణాన్ని తట్టుకోలేని అతని భార్య గుండెలు బాదుకొంటూ శవయాత్రను అనుసరిస్తూ మార్గమధ్యంలో తన కుటీరం ముందు కూర్చొన్న తులసీదాసు కనిపించగా ఆయన పాదాలపై పడి విలపిస్తుంది.
 
తులసీదాస్ ఆ యువతిని లేవనెత్తి సుమంగళిగా జీవించమని ఆశీర్వదించగా.. ఆమె శవయాత్రను చూపి జరిగినది వివరిస్తుంది. అప్పుడు తులసీదాసు ఆమెకు అభయమిస్తూ, వెళ్లి శవయాత్రను ఆపించి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని నీటిని చల్లగానే మరుక్షణం ఆ చనిపోయిన యువకుడు లేచి కూర్చుంటాడు. ఈ సంఘటన గురించి విన్న జనమంతా మతాలకతీతంగా తులసీదాసు శిష్యులుగా మారటం మొదలవుతుంది. 
 
తులసీదాసు ప్రాభవం కొనసాగితే ఇస్లాం మిగలదంటూ మత పెద్దలు ఢిల్లీలో అక్బర్ మీద ఒత్తిడి తేవటంతో విచారణ కోసం తులసీదాసును తన మందిరానికి పిలిపిస్తాడు. ఈ సందర్భంగా రామ నామ విశేషాన్ని, రాముని ధర్మ నిరతిని తులసీదాసు పాదుషాకు వివరిస్తాడు. దీనికి బదులుగా అక్బర్ ఒక శవాన్ని తెప్పించి బతికించాలనీ, లేకుంటే మరణశిక్ష తప్పదని ఆదేశిస్తాడు.
 
రామాజ్ఞ మేరకే అంతా జరుగుతుందనీ, ఆ యువకుడిని బతికించటమూ రాముని లీలేనని, రామాజ్ఞకు భిన్నంగా రాజాజ్ఞను పాటించలేనని తులసీదాసు తేల్చిచెప్పగా, ఆగ్రహించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆదేశిస్తాడు. 
 
అప్పుడు తులసీదాస్ ధ్యానమగ్నుడై రాముని స్మరించి, సమస్యను పరిషరించమని ప్రార్థించగా, మరుక్షణం ఆ సభలోకి వేలాది కోతులు దూసుకొచ్చి తులసీదాసును బంధింప వచ్చిన సైనికుల ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జరిగినదానికి అందరూ తెల్లబోయి చూస్తుండగా, కన్నులు తెరచిన తులసీదాసుకు హనుమ దర్శనం ఇస్తాడు. 
 
సాధారణ భక్తుడైన తనను కాపాడేందుకు సాక్షాత్తూ హనుమే తరలిరావటంతో ఒళ్ళు పులకించిన తులసీదాస్ కళ్ళవెంట ఆనందభాష్పాలు కార్చుతూ 40 దోహాల హనుమాన్ చాలీసాను ఆశువుగా గానం చేస్తాడు. ఆ స్త్రోతంతో మరింత ప్రసన్నుడైన హనుమ ఏదైనా వరం కోరుకోమని అడగగా, కష్టాల్లో ఉండే వారు హనుమాన్ చాలీసాను చదివితే ఈతిబాధలు తొలగిపోవాలని వేడుకుంటాడు. అప్పటి నుంచి హనుమాన్ చాలీసా రామ భక్తుల పాలిట కామధేనువుగా నిలిచింది. 
 
భక్తి, విశ్వాసం, వినయం, సాహసం, సత్యనిష్ఠ వంటి ఎన్నో సుగుణాలకు ప్రతీక అయిన ఆంజనేయుడి అనుగ్రహం పొందాలంటే.. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం లేదా వారానికి ఓసారి శనివారం నిష్ఠతో ఆయన్ని పూజించే వారికి ఈతిబాధలు వుండవు. శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీ ప్లాంట్ ఆగ్నేయంలో వుంటే మంచిదా?