కలియుగంలో పిలిచిన పలికే తిరుమలేశుడికి పేర్లు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ విచిత్రమైన పేర్లు. అవన్నీ స్వామివారి సొంత పేర్లా అంటే అదీ చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం. భక్తులు ప్రియంగా పిలుచుకుంటున్నవే.
వాటిల్లో ప్రసిద్ధమైనది ఏడుకొండలవాడా అని. శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే ఏడుకొండల్లో ఉన్న స్వామి కనుక ఏడుకొండలవాడు అయ్యాడు. అలాగే వేం-- పాపాలను, కటః-- పోగొడతాడు కనుక వేంకటపతీ అని, తిరుమలేశుడనీ, స్థలాన్ని బట్టి, చేసే పనిని బట్టి పిలువబడుతున్న స్వామి శ్రీనివాసుడు.
కానీ అన్ని పేర్ల కంటే మరో విచిత్రమైన పేరు ఉంది. అదేమంటే భార్యతో పిలిపించుకోవడం. అదే శ్రీనివాసుడు. ఆయన వక్షఃస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మి భక్తుల కోరికలను తీర్చడంలో స్వామికి చెప్పి సిఫారసు చేస్తుందట. ఆమె వాత్సల్యగుణోజ్జ్వలాం కనుక భక్తుల మీద ప్రేమ ఎక్కువ. ఆ తల్లి వల్లే శ్రీనివాసుడు అంటున్నారు.
అసలు నీ పేరేమయ్యా అంటే చెప్పడు కానీ, అడుగడుగు దండాలవాడ అన్నా పలుకుతాడు. ఆపద్బాంధవా అన్నా పలుకుతాడు. ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతూ మన కోరికలు తీరుస్తూనే ఉన్న వింతవింత పెట్టుడు పేర్ల దేవుడు వెంకటేశుడు.