శ్రీ మహావిష్ణువు యెుక్క 108 దివ్యక్షేత్రాల్లో తిరువనంతపురం ఒకటి. కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ క్షేత్రం క్రీ.శ. 1568లో నిర్మింపబడినది. శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడ స్వామిని దర్శించి, పద్మతీర్ధంలో స్నానమాచరించినట్లు తెలుస్తుంది.
ఇక్కడ శ్రీ అనంతపద్మనాభస్వామి, ఆదిశేషుని తల్పం మీద యోగ నిద్రలో శయనించి ఉంటాడు. ఆయనతో కొలువైన దేవి పేరు శ్రీహరి లక్ష్మీతాయార్. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. మెుదటి ద్వారం నుంచి తలభాగం, మధ్య ద్వారం నుంచి బొడ్డు, అందులో పుట్టిన తామరపువ్వు, మూడవ ద్వారం ద్వారా పాదభాగం కనిపిస్తాయి.
ఈ స్వామి గురించి నమ్మాళ్వార్ తన తిరువాళయ్ మెుళి ప్రబందంలో కీర్తించియున్నారు. ఆలయంలోని మూలవిరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారుచేశారు. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ముగ్ధమనోహరరూపానికి తన్మయుడైన ముని తనవద్దనే ఉండిపొమ్మని ప్రార్ధించాడు. అప్పుడు ఆ బాలుడు ఎప్పుడూ ప్రేమపూర్వకంగా చూసుకుంటే ఉంటానని మాటిచ్చాడు.
ఒకరోజు దివాకరముని పూజలో ఉండగా ఆ బాలుడు సాలగ్రామాన్ని నోటిలో ఉంచుకుని పరుగెత్తాడు.దానికి అనుగ్రహించినందు వల్ల ఇచ్చిన మాటను తప్పినందువల్ల వెళ్లిపోతున్నానని తిరిగి చూడాలనిపిస్తే అడవిలో ఉంటానని చెప్పి మాయమయ్యాడు.
తీవ్రమనోవ్యధకు గురైన ముని బాలుడ్ని వెతుకుతూ అడవికి వెళ్లగా ఒక్కక్షణం కనిపించి, మహా వృక్షరూపంలో నేలకొరిగి శేషశయనుడిగా కనిపించాడు. ఆ రూపం ఐదు కిలో మీటర్ల
దూరంలో వ్యాపించి ఉన్నందున మానవమాత్రులు దర్శించలేరని వేడుకోగా, ప్రస్తుతరూపంలో స్వామి వెలిసారని తాళపత్రాలలో లిఖించబడింది.
అనంతుడూ, అవినాశుడూ, సర్వజ్ఞుడూ, సంసారసాగర అంతాన ఉండేవాడూ, యావత్ప్రపంచానికి మంగళాకరుడూ అయిన నారాయణుని అధోముఖమైన తామరమెుగ్గలా ఉన్న హృదయంతో ధ్యానిద్దాం ..మన కష్టాలను తీర్చుకుందాం.