Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ మహాలక్ష్మి వైభవం... విశిష్టత

శ్రీ మహాలక్ష్మి వైభవం... విశిష్టత
, గురువారం, 8 నవంబరు 2018 (21:18 IST)
లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు. భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాల నుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది. హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి.
 
ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
 
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.
 
తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు.
 
విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.
 
చాలామంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని...... లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అనే నామాలతో లక్ష్మీదేవిని భక్తులు స్తుతిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం పూట ఆంజనేయ స్వామి సింధూరం తీసుకుని?