ప్రతిరోజూ ఉదయమవుతుంది. ప్రతిరోజూ రాత్రవుతుంది. సంవత్సరాలు సంవత్సరాలే అలా దొర్లిపోతాయి. సగం ఆయువు నిద్రావస్థలోనే గడిచిపోతుంది. మిగిలిన సగం జీవితం కూడా మనిషి సుఖశాంతులనివ్వదు. బాల్యం క్రీడల్లో గడుస్తుంది. తరుణావస్థ తరుణీ ఆసక్తిలో వ్యయమవుతుంది. వృద్ధాప్యం జరారోగాలతో సదా పీడితమై వుంటుంది.
నరజన్మ ఎత్తటం, శరీరాన్ని పుష్టివంతం చేసుకోవడానికేనా? శ్వాస-ఉచ్ఛ్వాసలు చేస్తూ ముసలివారు కావటానికా, ఇదేనా నరజన్మ ప్రయోజనం? జంతువుల కన్నా విశేషం నరజన్మకు మరేం వుంటుంది? కుక్కలు కూడా కడుపు నింపుకుంటాయి. యథేచ్చగా సంతానాన్ని కంటూ పోతాయి. మనుషులు కూడా ఈ మాత్రమే చేస్తే ఇక నరజన్మకున్న విశిష్టత ఏమిటి? దేహాన్ని పోషించటం మైథునం-ఇవే నరజన్మకు ప్రయోజనాలైతే, నిజంగా అప్పుడు నరజన్మకు అర్థం వుండదు.
క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూత దయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం వీటిని అనుష్టించేవారి జన్మ చరితార్థమవుతుంది.