Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణుడు పతనమై ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటో తెలుసా? (Video)

కర్ణుడు పతనమై ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటో తెలుసా? (Video)
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:46 IST)
భారతదేశ ఇతిహాసాలలో అతిపెద్దదైన మహాభారతాన్ని మననం చేసుకుంటే మనకు కురుక్షేత్రం విశిష్టత, ధర్మ సంస్థాపన గుర్తుకువస్తుంది. కురుక్షేత్రంలో ఎంతోమంది మహనీయులు, మహావీరులు తమ ప్రాణాలను త్యాగం చేసినప్పటికీ వారిలో కర్ణుడిది ప్రత్యేకమైన పాత్ర. స్నేహం అంటే దుర్యోధన కర్ణులదే అని మనం సర్వసాధారణంగా చెప్పుకుంటుంటాం. అసలు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓటమిపాలు కావడానికి, కర్ణుని పరాక్రమం ఏమాత్రం ఉపయోగపడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణుడి పరాక్రమం, అది కోల్పోవడానికి కారణాలను తెలుసుకుందాం. 
 
కౌరవులకి పాండవులంటే గిట్టేది కాదు. పాండవులను ఎవరైనా ప్రశంసిస్తే దుర్యోధనుడు సహించేవాడుకాదు. ఒకానొక సమయంలో పాండవులకు, కౌరవులకు మధ్య బలపరీక్ష జరిగే సమయంలో కర్ణుడు అక్కడికి వస్తాడు. ఇదివరకే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడు అక్కడ అర్జునుడిని ఓడిస్తాడు. అది చూసిన దుర్యోధనుడు యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కోగల మహావీరుడు వచ్చాడని సంతోషించి అతనితో చెలిమి చేసుకుంటాడు. అతనికి అర్ధ రాజ్యం ఇచ్చి సత్కరిస్తాడు. ఆ సమయంలో కర్ణుడు కృతజ్ఞత చూపించదలిచి, దుర్యోధనుడి కోసం, కురుసామ్రాజ్య ప్రతిష్ట కోసం తాను ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అని ప్రతిజ్ఞ చేస్తాడు. 
 
ఆ ఆశతోనే ఉన్న దుర్యోధనుడు కర్ణుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమంలో రథంపై ఊరేగుతున్న కవచ కుండలాలు గల ఆ వీరుడుని చూసి కుంతీదేవి తన పుత్రునిగా గుర్తిస్తుంది. కానీ మనసులో అనందం ఉన్నప్పటికీ ఆనాడు సంఘానికి భీతి చెంది చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుని క్షోభపడుతుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో ఏనాడు ఎవరికీ మేలు చేసినట్లు ఎరుగని దుర్యోధనుడు తనకు ఇంతటి భాగ్యాన్ని ఎందుకు కలుగజేసాడని ఆలోచిస్తూ తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. 
 
కర్ణుడు తన చిన్నతనంలో తల్లియైన రాధ దగ్గరకు వెళ్లి తనకు కవచ కుండలాలు ఎలా వచ్చాయని అడుగుతాడు. రాధ అప్పుడు సమాధానమిస్తూ పిల్లలు లేని మాకు నువ్వు నదిలో బుట్టలో దొరికావనీ, తాము అసలు తల్లిదండ్రులము కామనీ, ఐతే నిన్ను ప్రాణప్రదంగా పెంచుకున్నాము అని చెప్పింది. కొంతకాలం తర్వాత కర్ణుడు విద్యను నేర్చుకోవడానికి పరశురాముడి వద్దకు వెళతాడు. కానీ పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పనని చెబుతాడు. కర్ణుడు తాను క్షత్రియుడిని కానని శూద్రుడినని చెబుతాడు. 
 
అర్జునుడు తండ్రి ఇంద్రుడు కర్ణుడి నైపుణ్యాలను చూసి ఓర్వలేక, అర్జునుడికి ఏనాటికైనా ముప్పు వస్తుందని గ్రహించి పన్నాగం చేస్తాడు. పరశురాముడు ఒకనాడు కర్ణుడి తొడపై తల ఉంచి విశ్రమిస్తుండగా, ఇంద్రుడు కీటకం రూపంలో కర్ణుడి తొడను గాయం చేసి రక్తస్రావం కలిగిస్తాడు. రక్త స్పర్శకు పరశురాముడు మేల్కొని కర్ణుడి సహనాన్ని గమనించి నీవు శూద్రుడవని చెప్పి మోసం చేసావు, నీవు నేర్చుకున్న విద్యలు నీకు అవసరమైన సమయంలో ఉపయోగపడవు అని శపిస్తాడు. 
 
కర్ణుడిని ఎన్నో శాపాలకు గురిచేస్తాడు ఇంద్రుడు. కర్ణుడు ఆందోళనతో అడవిలో వెళుతుండగా గోవును సమీపిస్తూ ఒక పులి కనిపిస్తుంది. కర్ణుడు దానిపై బాణాన్ని సంధిస్తాడు. అది మరణించి లేగదూడ రూపంలోకి మారుతుంది. గోవును పెంచుకుంటున్న వేద పండితుడు దానిని చూసి ఆగ్రహం చెంది, కర్ణుడిని నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీకు ఎవరూ సహాయం చేయరు అని శపిస్తాడు. 
 
ఒకరోజు కర్ణుడు రాజ దర్బారుకి వెళుతుంటే దారిలో ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది, పాపను సముదాయించి కారణం అడుగగా, తాను ఇంటికి నెయ్యి తీసుకువెళుతుండగా అది క్రిందపడి నేలపాలయ్యిందని, నెయ్యి తీసుకువెళ్లకపోతే తల్లి తిడుతుందని చెబుతుంది. కర్ణుడు వెంటనే మట్టిలో పడిన నెయ్యిని గట్టిగా పిండి పాపకు ఇస్తాడు.

భూదేవి ప్రత్యక్షమై భూమి స్వీకరించిన దానిని తిరిగి తీసుకోకూడదని తెలియదా, యుద్ధ సమయంలో నీ రథాన్ని నేను మోయనని శపిస్తుంది. ఇన్ని శాపాలకు గురైన కర్ణుడు చివరికి కురుక్షేత్రంలో వీరమరణం పొందుతాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-09-2019 సోమవారం దినఫలాలు - మీ సమస్య ఒకటి...