Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిలుకకు అర్థమైంది కానీ అతడికి అర్థం కాలేదు, అదే తేడా...

చిలుకకు అర్థమైంది కానీ అతడికి అర్థం కాలేదు, అదే తేడా...
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (22:50 IST)
ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో వుంచి పోషించేవాడు. ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, "మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు''!? అని?
 
అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను. 
"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.  మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.
 
సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని. అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది చూసిన చిలుక యజమాని భయపడి, నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
 
అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని. యజమాని బదులిచ్చాడు, 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితికెళ్లిపోయారు' అని.  "సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.
 
 మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు. యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.
 
 గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు. "నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది ఎగిరిపోయింది" అని దిగులుగా చెప్పాడు.
 
గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు." అని అన్నాడు. యజమాని సిగ్గుతో తలదించుకొన్నాడు. దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులు త్వరపడండి, దర్సన టిక్కెట్ల కోటా విడుదల, ఎప్పుడంటే?