షిరిడీసాయి బాబా మహిమలు....

షిరిడీసాయి తత్వంలో అహానికి చోటులేదు. అహం పట్ల బాబాకు ఎనలేనికోపం ఉండేది. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వీడమని బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మెుదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి అంధత్వం లాంటిదనేది బాబా భావన. అహంకారంపు

మంగళవారం, 3 జులై 2018 (15:25 IST)
షిరిడీసాయి తత్వంలో అహానికి చోటులేదు. అహం పట్ల బాబాకు ఎనలేనికోపం ఉండేది. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వీడమని బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మెుదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి అంధత్వం లాంటిదనేది బాబా భావన. అహంకారంపు చీకట్లు తొలగనిదే ఏ మనిషినీ తన దరికి చేర్చుకునేవారు కాదు.
 
తన ప్రేమతత్వంలో మానసిక ఆనందాన్ని తన జీవిత చరిత్ర రాయడానికి అనుమతి కోసం వచ్చిన హేమాడ్‌పంత్‌కు బాబా మెుదటగా ఈ సందేశాన్నే అందించారు. మతాలపేరిట మనుషుల నడుమ అంతరాలను ఆయన తన మతంలో చేర్చలేదు. సమస్తప్రాణులు ఒకటేనని, ప్రేమ, దయ, కరుణలతో మానవ జీవితం సాగాలని భగవంతునియందు అపారనమ్మకంతో మంచి కర్మలు చేయడమే పరమావధిగా జీవించాలి.
 
దానగుణం కలిగి ఉండటం, పనిపట్ల శ్రద్ధ వహించటం, బాధ్యతలను ఏమారకపోవటం ప్రతిమనిషి పరమ కర్తవ్యాలని గీతాసారంలా బాబా తనదైన సాయిగీతలా భక్తులకు చెప్పేవారు. తనను విశ్వసించిన వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చేవారు. తన భక్తిసామ్రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో దేనికి కొరత లేకుండా జీవిస్తారని భరోసా ఇచ్చేవారు బాబా. 
 
యోగులలో పరమయోగి. నమ్మిన వారి ఏలిక. జీవితమంటేనే ప్రేమమయమని చాటిన సత్యస్వరూపుడు. బాబాను పూజించడంతో సంతృప్తి పడటం, ఉపవాసాలు ఉండి ఊరడిల్లడం, షిరిడీ వెళ్లి సంతోషపడడమే కాకుండా ఆయన బోధలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సద్గురువు అనుగ్రహం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పితృదోషాలను ఎలా తొలగించుకోవాలో తెలుసా?