శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దేశ సంచారంలో భాగంగా నంద్యాల ప్రాంతంలో దిగువమెట్టు అనే గ్రామంలో మకాం వేసారు. అక్కడ స్వామి వారి శిష్యులు భోజనాలకు ఏర్పాటు చేసే పనిలో ఉండగా, స్వామివారికి దాహం వేసి, సమీపమన ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి, నీళ్లు అడిగారు. అంతట అతను స్వామివారిపై చిరాకు పడుతూ, నూతి దగ్గరకు పోయి నీరు తోడుకుని త్రాగమని చెప్పాడు. సమీపమున ఉన్న సిద్దయ్య యోగి పుంగవులు దాహము కలిగి నీరు అడిగినంత మాత్రమున చీత్కరించుట తగునా అన్నాడు. దానికి అతడు సన్యాసి, స్వామి అంటూ వచ్చే అడ్డమైన ప్రతీవాడికీ నా ఇల్లే తేరగా దొరికిందా. దాహం తీర్చండి, దానం చెయ్యండి అని గడపెక్కిన ప్రతీ ఒక్కడికీ సమాధానం చెప్పలేక చిరాకు వస్తుంది. నిజంగా నీ స్వామి అంత గొప్పవాడైతే ఈ లోహపు ద్రవాన్ని తాగి దాహం తీర్చుకోమను అంటూ కరుగుతున్న లోహమున్న మూసను పటకారుతో పట్టుకుని స్వామివారి ముందు పెట్టాడు.
వీరబ్రహ్మేంద్రస్వామివారు మందహాసం చేస్తూ, పట్టకారుతో తళతళలాడుతున్న లోహద్రవంతో ఉన్న మూసను అందుకుని గడగడా గొంతులో పోసుకున్నారు. అది చూసిన అతడు గజగజా వణికిపోతూ, స్వామివారి పాదాలపై పడి, క్షమించండి స్వామీ! మూఢుడ్నై మిమ్ములను అవమానపరిచాను, క్షమించానని చెబితే గాని, పాదాలు వదలను అంటూ చేతులతో పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. నాయనా! మా మహత్తును, మమ్మల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే వారంటే మాకు చాలా ఇష్టం అని విశ్వబ్రాహ్మణునికి అభయమిచ్చి లేపారు. సంపద శాశ్వతము కాదు, సన్మార్గమున పయనిస్తూ సత్కర్మలు చేస్తూ జీవితం సాగించి మానవ జన్మను సార్థకం చేసుకొమ్మని బోధించారు.
నంద్యాల విశ్వబ్రాహ్మణుల మదమణుచుట
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు దిగువుమెట్ట గ్రామం వద్ద విడిది చాలించి, నంద్యాల చేరుకుని దర్శించుకున్న స్థానిక భక్త జనులకు అనుగ్రహ భాషణం చేసి, భోజన సమయమాసన్నమవుతున్నా అక్కడ, భోజన ఏర్పాట్లు కానరాకపోవుటతో తనవెంట వచ్చిన శిష్యబృoదమును ఆకలితో ఉంచుటకు ఇష్టపడక, విశ్వబ్రాహ్మణులు నివసించే వీధికి పోయి, నాయనలారా! కందిమల్లయపల్లె నుండి శిష్య సమేతముగా మీ దర్శనార్థం వచ్చాను, మీరు సంపన్నులని విన్నాను. కాఠిన్యము వీడి, మా పొట్టలు నింపుతారని ఎదురు చూస్తున్నాను అని ప్రాధేయపూర్వకముగా యాచించారు. అంతట ఆ విశ్వబ్రాహ్మణులు హేళన చేస్తూ, మీరిలా కులవృత్తిని వదిలిపెట్టి, ఊరూరా భిక్షగానివలే తిరగడం మాకు సిగ్గుగా ఉంది అని నిందించారు.
అందుకు బ్రహ్మం గారు, నాయనలారా! మేము తిండి, బట్టలు లేక ఇలా దేశాలు పట్టి తిరుగుతున్నాము. క్షద్భాధ తాళలేకున్నాము. మా ఆకలి తీర్చగల పుణ్యాత్ములు మీలో ఒక్కరైనా లేరా? అని అర్థించారు. అంత ఆకలిగా ఉన్నారా? ఎంత తింటారో చెప్పండి, వండి వార్చేస్తాం. పుట్టెడు బియ్యం వార్పిస్తే సరిపోతుందా అని హేళనగా పలికారు. దానికి స్వామివారు ఎంత వడ్డించినా ఆరగిస్తాం అనడంతో వారు పుట్టెడు బియ్యము వండించి రాశిగా పోసి రండి స్వామీ, రండి, వచ్చి ఆరగించండి అని హేళనగా పిలిచారు.
స్వామివారు రాశిగా పేర్చిన అన్నం వద్దకు వచ్చి, మా సిద్దయ్య చాలా ఆకలిగా ఉన్నాడు. ఇది అతని ఆకలినైనా తీర్చగలదో లేదో చూద్దాం అంటూ, ఆ రాశిలో నుండి ఒక పిడికెడు అన్నం తీసి పట్టుకుని సిద్దయ్యను భుజించమన్నారు. సిద్దయ్య అన్నం రాశి ముందు మటము వేసుకుని కూర్చొని, మొత్తము అన్నము క్షణాలలో తిని, ఇంకా ఆకలి తీరక ఆవురావురుమంటూ అక్కడున్న వారి వైపు చూడసాగాడు. గొప్పలకు పోయిన విశ్వబ్రాహ్మణులకు పరిస్థితి అవగతమయింది. తలకెక్కిన మదం ఒక్కసారి దిగిపోయింది. స్వామివారి గొప్పతనం కథలు కథలుగా ముందే వినివున్నా ధనమదంతో ధర్మాధర్మములు, అతిథి మర్యాదలు మరచి, వ్యవహరించినందుకు సిగ్గుపడుతూ తల వంచుకుని ముకిళిత హస్తాలతో, గురువర్యా! మేము వండి వడ్డించించినది, ఒక్కరి అకలి కూడా తీర్చలేకపోయినది.
మీ వెంట ఉన్న ఇంతమంది శిష్యులకు వడ్డించగల సామర్థ్యం మాకు లేదు. మా యందు దయదలచి మా ఈ సంకట స్థితినుండి కాపాడండి ప్రభూ! మా సంపద మీ మహిమల ముందు అణుప్రాయమైనది. క్షమించి ఆదుకొండి స్వామీ అంటూ క్షమాభిక్ష యాచించారు. అంతట వీరబ్రహ్మేంద్రస్వామివారు, తప్పు తెలుసుకున్నవారిని ఇంకా బాధ పెట్టడం ఇష్టంలేక తన పిడికిలితో పట్టుకున్న అన్నం ముద్దను సిద్దయ్య నోటికందించడంతో అతని ఆకలి తీరి బ్రేవుమని త్రేన్చాడు. సిద్దయ్య కూర్చున్న వద్ద నుండి లేవడంతో, విశ్వబ్రాహ్మణులు ఊపిరి పీల్చుకుని, అందరికీ పంచభక్ష్య పరమాన్నములు వండి వడ్డించి స్వామివారినీ, వారివెంట ఉన్న శిష్య బృందాన్నీ తృప్తి పరిచి, స్వామివారిని ప్రశంసలతో ముంచెత్తారు. వారందరూ ప్రాథేయపడగా స్వామివారు నంద్యాలలో కొన్నాళ్ళు ఉండి జ్ఞానబోధ చేసి ధర్మమార్గమును సూచించారు. (ఇంకా వుంది)