Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాపట్ల మీదుగా తిరుపతి చేరుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కుళ్లిపోయిన కుక్కను చూపించి...

Advertiesment
Sri Veerabrahmendra Swamy

సిహెచ్

, శనివారం, 20 సెప్టెంబరు 2025 (23:05 IST)
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు హైదరాబాదు విడిదిని వీడి అనుగ్రహ భాషణములు ఇస్తూ, శిష్యులతో సహా బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కాళహస్తి మీదుగా తిరుపతి చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్ళు శ్రీ వేంకటేశ్వర స్వామివారి చెంత  గడిపి కందిమల్లయ్యపల్లెకు తిరుగు ప్రయాణం అయ్యారు.
 
స్వామివారు వెంట వచ్చిన భక్తులు తాను సిద్ధయ్యను ప్రత్యేకముగా చూస్తున్నట్లు భావించి తన పట్ల ఈర్ష్యాభావము పెరుగుట గ్రహించి, దానిని నివృత్తి  చేయకపోతే మంచిది కాదని తలంచి, మార్గమధ్యమున చచ్చి దుర్గంధం వస్తూ, పురుగులు పట్టి పడి ఉన్న ఒక కుక్కను చూపించి, తన వెంట వస్తున్న శిష్యులను ఆరగించమన్నారు. దగ్గర చేరడానికే దుర్లభముగా ఉన్న శునకము దగ్గరకి వెళ్ళకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనసాగారు. అందులో ఉన్న సిద్ధయ్య మాత్రం ముందుకు వచ్చి మహాభాగ్యము గురువర్యా అని స్వామి వారి వద్ద అనుమతి తీసుకుని, గురుసార్వభౌమార్పణమస్తు అని ఉచ్చరించి దుర్గంధము వల్ల ఇబ్బంది పడుతుండుటగాని, పురుగులకు అసహ్యము పడుట గాని చేయక పంచభక్ష్య పరమాన్నములారగించునట్లు ఆ శునకమును ఆరగించాడు. నాయనలారా చూసారుకదా! శిష్యుడైనవాడు గురువు ఆజ్ఞను వేరు ఆలోచన లేక త్రికరణ శుద్ధిగా పాటించాలి అని స్వామివారు పలుకగా, మిగిలిన శిష్యులు తమ తప్పు తెలుసుకుని సిగ్గుతో తలలు దిoచుకున్నారు.
 
వీరబ్రహ్మేంద్రస్వామి వారు కుష్టువ్యాధి నయము చేయుట
కందిమల్లయ్యపల్లె శిష్యులందరూ గాఢనిద్రలో ఉండగా, వీరబ్రహ్మేంద్రస్వామి వారూ, సిద్దయ్య మఠంలో ఉన్న వటవృక్షంక్రింద కూర్చొని వేదాంత విషయాలను చర్చించుకుంటున్నారు, ఇంతలో  బిగ్గరగా రోదన వినిపించింది. స్వామివారు సిద్దయ్యను తీసుకుని అటువైపు పరుగున వెళ్ళారు. అక్కడ కుష్టురోగంతో భాధపడుతూ, వ్యాధి తీవ్రతను భరించలేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన బ్రాహ్మణుడు, పక్కనే అతనికి పరిచర్యలు చేస్తూ అతని భార్య కనిపించారు. స్వామివారిని చూసినంతనే కాళ్ళమీద పడి, ఏ జన్మలో ఏ పాపం చేసామో, ఈ బాధలను అనుభవిస్తున్నాము, పెనిమిటి బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. అతనిని ఈ దుస్థితి నుoడి కాపాడే దేవుడే కానరావడం లేదు అని విలపించనారంభించింది. స్వామివారి దయార్ద్ర హృదయము చలించిపోయింది. ఆ దుర్భరస్థితిలో ఉన్న బ్రాహ్మణుని శిరము నుండి పాదముల వరకు స్పృజించి, నాయనా! లేచి కూర్చో అని పలికిన వెంటనే, వ్యాధి ఆనవాళ్ళు కొద్దిగానైనా కనిపించని విదంగా కుష్టువ్యాధి నిర్మూలించబడగా, ఆ బ్రాహ్మణుడు లేచి కూర్చున్నాడు. అంతట భార్యాభర్తలిద్దరూ స్వామివారి పాదాలపై పడి పలు విధాల స్తుతించి ఆశీస్సులు స్వీకరించి స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయారు.
 
కడప నవాబు స్వామివారికి తాఖీదు పంపుట   
ఒక రోజు స్వామివారు మఠంలో భక్తులకు జ్ఞానభోధ చేయుచుండగా, కడప నవాబు పంపిన ఆజ్ఞాపత్రమును భటులు తెచ్చి ఇచ్చారు. అది తెరిచి చదవగా ఇలా ఉంది. కందిమల్లయ్యపల్లె మఠాద్యక్షులైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి, కడప నవాబు వ్రాయు ఫర్మానా. మీరు ముడమాలగ్రామస్తుడైన, మహమ్మదీయ మతానికి చెందిన, పీరు సాహెబు యొక్క ఏకైక పుత్రుడైన సిద్దయ్యను వంచించి, హిందూ మతంలోనికి మార్పిడి చేసి, జాతి భ్రష్టుడ్ని చేసారు. అందువలన మీరీ లేఖను చదివిన వెంటనే బయల్దేరి మా సముఖమునకు వచ్చి, మీ సంజాయిషీ ఇచ్చుకొనవలెను, లేదా మడమాలకు పోయి సిద్ధయ్యను తల్లిదండ్రులకు అప్పజెప్పి, ఆ వివరములు మాకు తెలియజేయవలెను. అలా చేయని యెడల మా దండనను అనుభవించవలసి ఉంటుంది. ఇది మా ఆజ్ఞ. ఈ విషయాన్ని స్వామివారు చదివి వినిపించగా, సిద్ధయ్య స్వామీ నేనే వెళ్ళి నవాబుకు వివరించి వస్తాను అని చెప్పి నవాబు వద్దకు భటులతో పాటు బయలుదేరాడు.
 
సిద్దయ్య కడప నవాబుకు తన శక్తి చూపుట
సిద్ధయ్య కడప కోటకు వెల్తూ భటులను మాటల్లో పెట్టి, కొంతదూరము నడిచిన తరువాత, కనిపించకుండా నిష్క్రమించి, వారికంటే ముందే కడప చేరుకున్నాడు. కడపలో జనసంద్రంగా ఉన్న ఒక అంగళ్ళ కూడలిలో ఉన్న ఒక చెట్టును ఎంచుకుని, అక్కడ వచ్చే పోయేవారికి దేవుని గురించి, దైవ తత్వము గురించి, దైవచింతన వల్ల కలిగే సత్ఫలితాల గురించి చెప్తూ అందరినీ ఆకర్షించసాగాడు. అతని భాషణలు విన్న వారందరూ నామాలు  పెట్టుకోవడం, రుద్రాక్షలు వేసుకోవడం ప్రారంభించారు. వారిలో మహమ్మదీయులు కూడా ఉన్నారు. ఈ విషయం, ఈ నోటెంట ఆ నోటెంట అక్కడి మత పెద్ధయైన ఖాజీ చెవులకు చేరింది. ఖాజీ హుటాహుటిన కడప నవాబు వద్దకు చేరుకుని, సిద్దయ్య భటుల కళ్లుకప్పివచ్చి కడపలో ఉన్న మహమ్మదీయులని హిందువులగా మార్చేస్తున్నాడని ఫిర్యాదు చేసాడు. నవాబు కోపోద్రిక్తుడై సిద్దయ్యను ఉన్నపళంగా తీసుకువచ్చి మా ముందు హాజరు పరచండి అని తన భటులకు హుకుం జారీచేసాడు.
 
ఆఘమేఘాల మీద అంగళ్ళ కూడలికి వెళ్లి భటులు సిద్దయ్యను తెచ్చి నిండు సభలో నవాబు ముందు హాజరు పరిచారు. సిద్దయ్య నవాబు ముందు సలామైనా చేయకుండా నిటారుగా, నిర్భయముగా నిలబడ్డాడు. దానితో నవాబు కోపం నశాలానికెక్కింది. నవాబు, ఏమిటీ వేషం, నువ్వు హిందువా, మహమ్మదీయుడివా అని గద్దించాడు. దానికి జవాబుగా సిద్దయ్య, ప్రభో! ఎవరిది వేషము కాదు!, జీవుడు జన్మ ధరించుటే వేషము. శాశ్వతము కాని జన్మమున ఒక పాత్ర ధరించి నాది, నా వాళ్ళు అనుకుంటూ భవబంధాలలో చిక్కుకుని ఈ భూమి అనే నర్తనశాలలో చలించుచున్నాడు. ఈ బ్రహ్మాండములో జన్మించిన ప్రతీ జీవి ఏదో ఒక వేషము ధరించి అదే నిత్యమూ శాశ్వతమూ అయినట్లు రక్తి కట్టిస్తున్నాడు. ఆయువు కాయమును వీడినంతనే అప్పటికి ఆ పాత్ర ముగుస్తుంది. పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ మానవుడు కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, భటుడిగా, మంత్రిగా, రాజుగా ఎవరికి వచ్చిన వేషం వారు ధరించి రక్తికట్టిస్తున్నారు. అయితే వారు వేషమని గ్రహించరు.. కనిపిస్తున్నదేదీ సత్యమూ శాశ్వతమూకాదు. అంతా మిధ్య అంటూ వేదాంత సారాన్ని వల్లెవేసాడు.
 
దానికి నవాబు, ఇంత తెలిసిన వాడివి, ప్రభువుకు సలాము చెయ్యాలన్నది నీ పాత్ర ప్రస్తుత ధర్మమని  తెలియదా అని గద్దించాడు. అంతట సిద్దయ్య, నా సలాము నా గురువుగారు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు. మీ క్షేమం కోరే ‌మీకు సలాము చెయ్యలేదు అని  బదులిచ్చాడు. దీనితో నవాబు, ఏం మాట్లాడుతున్నావో తెలివుండే మాట్లాడుతున్నావా? నువ్వు, నీ గురువే గొప్ప వాళ్లా?  ప్రభువులమైన మేము మీ స్థాయని అందుకొలేమా? రుజువు చెయ్యి అటూ మండిపడ్డాడు. దానికి సిద్దయ్య మందహాసము చేస్తూ, వేషభాషలలో ఢాంభికాలు ప్రదర్శిoచినంత మాత్రాన గొప్పవారైపోరు. మా గురువుగారి గొప్పతనం తెలుసుకోవాలంటే, ఒక నల్లరాతి పలికను ఈ సభా స్థలికి తెప్పించండి. నిరూపిస్తాను అన్నాడు. అంతట నల్లరాతి పలికను సభా మధ్యభాగమున తెప్పించి పెట్టించాడు నవాబు.
 
సిద్దయ్య ఆ పెద్ధ రాతి పలక ముందుకు వెళ్ళి మనస్సులో తన గురువర్యులైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని తలంచుకుని, దానికి సలాము చేసాడు. వెంటనే అది ఫఠేల్మని శబ్ధం చేస్తూ తునాతునకలై నలువైపులా చెల్లాచెదురయ్యింది. కడప నవాబుకు సిద్దయ్య సలామును స్వీకరించే శక్తి లేదని నిరూపించుటకు సిద్దయ్య పెద్ద నల్ల పలకకు సలాము చేసి, దానిని తునాతునకలుగా బ్రద్దలయినట్లు చేయటతో బెంబేలెత్తిపోయున నవాబును చూస్తూ  సిద్దయ్య అతి సనాతన కాలము నుండి ధర్మమయమైన జీవన విధానమును తెలియజేస్తున్న హిందూ మార్గము పట్ల, ఆ మహోన్నత ధర్మబోధనల ద్వారా జనులను రుజువర్తనులుగా తీర్చిదిద్దుతున్న మా గురువుగారైన శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిపట్ల కించ భావము వీడిన, లోక కళ్యాణం కోసం అవతరించిన మా స్వామివారి గొప్పతనమూ, శక్తీ అవగతమవుతాయి అని నిండు సభలో గంభీరంగా సీద్ధయ్య చెప్పటంతో నవాబు చేతులు జోడిస్తూ గద్దె దిగి సిద్ధయ్య వద్దకు వచ్చి, మీశక్తే ఇంత అమోఘంగా ఉంటే మీ గురువుగారి ముందు నిలబడడానికి కూడా శక్తహీనుడనవుతాను. మీ నాన్న అయిన పీరు సాహెబ్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే మంచీచెడులు యోచించకుండా గర్వమధాంధుడినై స్వామివారికి తాఖీదు పంపినందుకు క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటాను, నన్ను తక్షణమే మీ వెంట తీసుకొని వెళ్ళండి అని నవాబు బ్రతిమలాడాడు.
 
సిద్దయ్య ప్రసన్న వదనంతో దూషణభూషణలు, తిరస్కార సన్మానాలు, చిత్కారాలు పొగడ్తలు అన్నీ యోగులకు, అవతార పురుషులకు సమానమే. ధర్మ మార్గమునెంచుకున్న మాబోటి వారికి ముళ్లబాటయినా పూల మార్గమైనా సమానమే. భౌతిక అనుభూతులు దేహమునకే గాని మనస్సుకు తాకవు. అనుభూతులు మనస్సుకు తాకవు గనుక చిత్తము అన్ని అవస్థలందూ స్థిరంగా, నిశ్చలంగా‌ ఉంటుంది. అందునా స్వామి వారు దయార్ద్ర హృదయులు, వారిని గురించి భయమవసరములేదు. మీవంటి వారు పీఠమునకు వచ్చిన, అక్కడి కార్యక్రమములకు అవరోధమవుతుంది. నేనే స్వయముగా వీలు చూసుకుని స్వామివారిని ఈ సభకు తీసుకునివచ్చి అనుగ్రహ భాషణమిప్పిస్తాను అని అభయమిచ్చి కందిమల్లయ్యపల్లెకు  సిద్దయ్య తిరుగు ప్రయాణమయ్యాడు. (ఇంకా వుంది)
- కొమ్మోజు వెంకటరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య 2025: రావి చెట్టుకు పాలు, చక్కెర కలిపిన నీటిని..?