Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహానంది పుణ్యక్షేత్రం ఎలా వెలిసిందో తెలుసా?

సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రమే మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోవు ఆపద ముద్రరూపంలో వెలిశాడు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడ

మహానంది పుణ్యక్షేత్రం ఎలా వెలిసిందో తెలుసా?
, బుధవారం, 4 జులై 2018 (11:52 IST)
సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రమే మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోవు ఆపద ముద్రరూపంలో వెలిశాడు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవున ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం.
 
పూర్వీకులు తెలిపిని కథానుసారం ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాద మహర్షి అని పిలిచేవారు. ఇతని భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు.
 
కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాదిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు. మహాదేవా నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి అంటూ నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ అని వేడుకున్నాడు. 
 
అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకుని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాదం మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. 
 
వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా వరం కోరుకో అనగా మహానందుడు దేవాదిదేవా నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు.
 
అలాగే అని వరమిచ్చిన శివుడు మహానందా నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-07-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఒంటరిగానే లక్ష్యాలను?