తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్తను అందించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్ల కోటాను గతంలో టీటీడీ నిలుపుదల చేసింది.
అయితే ఆ టిక్కెట్లను ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు సంబంధించిన దర్శనం టిక్కెట్లు ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో మంగళవారం నాడు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.