Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక సంక్షోభంలోకి తిరుమల శ్రీవారు.. ఏమైంది..!

Advertiesment
ఆర్థిక సంక్షోభంలోకి తిరుమల శ్రీవారు.. ఏమైంది..!
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్న ప్రమాద ఘంటికలు గోచరిస్తున్నాయి. ఒకవైపు డిపాజిట్లు తగ్గిపోతున్నాయి. వడ్డీరేట్లలో కోతపడుతోంది. మరోవైపు ఖర్చులు అదుపుతప్పుతున్నాయి. వెరసి టిటిడి భవిష్యత్తు ఆందోళన కలిగించేలా ఉంది. 
 
2019-120 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,116 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను పాలక మండలి ఆమోదించింది. ఏటా టిటిడి ఆదాయం పెరుగుతున్నా, అదుపు తప్పుతున్న ఖర్చులు, దుబారా వ్యయం వల్ల బ్యాంకులో డిపాజిట్‌ చేసే మొత్తం తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది.
 
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్‌ ఆదాయంగా పరిగణిస్తారు. కానుకల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్‌ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు దర్శనాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల విక్రయాలు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు. 
 
రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్‌ సరుకుల కొనుగోలు, విద్యుత్‌ ఛార్జీలు వంటివాటి కోసం ఖర్చు చేయాలి. డిపాజిట్లు ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది. భవిష్యత్తులో హుండీ ఆదాయం తగ్గినా…వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే డిపాజిట్‌ చేసే మొత్తమే తగ్గిపోతోంది. 
 
2018-19 సంవత్సరంలో రూ.200 కోట్లు కార్పస్‌ ఫండ్‌ కింద డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంటే ఆచరణలో రూ.86 కోట్ల మాత్రమే డిపాజిట్‌ చేయగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019-20లో కార్పస్‌ఫండ్‌ డిపాజిట్‌ లక్ష్యాలను రూ.78.85 కోట్లకు తగ్గించుకున్నారు. 2016-17లో రూ.475 కోట్లు, 2015-16లో రూ.783 కోట్లు, 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అటువంటిది ఇప్పుడు రూ.78 కోట్లకు పరిమితం చేశారంటే….డిపాజిట్లు ఎంతగా తగ్గించేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హుండీ ఆదాయం పెరుగుతున్నా తగ్గుతున్న డిపాజిట్లు
 
డిపాజిట్లు చేయడం అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడమే. ఆదాయం తగ్గినపుడు పొదుపూ తగ్గుతుంది. టిటిడి విషయంలో ఆదాయం తగ్గడం లేదు. పెరుగుతోంది. అయినా డిపాజిట్లు భారీగా తగ్గాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలను పరిశీలిస్తే…. 2014-15లో రూ.993 కోట్లు, 2015-16లో రూ.1000 కోట్లు, 2016-17లో రూ.1010 కోట్లు వచ్చాయి. 2017-18లో 1,116 కోట్లు వచ్చాయి. అంటే హుండీ ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతూనే ఉంది. 2014-15లో రూ.993 కోట్లు వచ్చినపుడే….రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అలాంటిది రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చినపుడు డిపాజిట్లు రూ.86 కోట్లుకు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
టిటిడిలో నిధులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. అధికారులు కూడా శ్రీవారి నిధులను ఉదారంగా పంచిపెట్టేస్తున్నారు. తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకుంటోంది. ప్రభుత్వ బాధ్యతలనూ టిటిడి చేపడుతోంది. ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాలను తన ఆధీనంలోకి తీసుకుంటూ ఖర్చులు పెంచుకుంటోంది. దేశ వ్యాపితంగా ఆలయాల నిర్మాణం పేరుతో కోట్లకు కోట్లు కుమ్మరిస్తోంది. ఇలాంటి ఖర్చులు  దాటిపోతున్నాయి. 2017-18లో గాంట్స్‌, కాంట్రిబ్యూషన్స్‌ కింద రూ.192 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా రూ.230 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు రూ.40 కోట్లు అదనంగా ఖర్చయ్యాయి. 2018-19లో ఈ వ్యయాన్ని రూ.285 కోట్లకు పెంచారు. 2019-20లోనూ రూ.284 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
 
ధార్మిక కార్యక్రమాల పేరుతో కోట్ల కుమ్మరింత
తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ అయినప్పటికీ, ధార్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఆ సంస్థపైన ఉన్నప్పటికీ…ఆర్థిక వనరులను, పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి అంచనాలు లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేస్తే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థ అయినా మునిగిపోతుంది. కొండలైనా కరిగిపోతాయి. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి ఇలాగేవుంది. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తన మెహర్బానీ కోసం, భద్రాచలాన్ని మించి శ్రీరామనవని నిర్వహించాలన్న అర్థంలేని పట్టుదలకుపోయింది. భద్రాచలాన్ని తలపించేలా ఒంటిమిట్టను అభివృద్ధి చేయాలని టిటిడిని ఆదేశించింది. అంతే….ఒకేసారి రూ.100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఒంటిమిట్టకు రోజుకు 200 మంది భక్తులు కూడా వస్తున్న పరిస్థితి లేదు. ఇక నాలుగేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఒంటిమిట్టలో ఏడాదికి రూ.4 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఒంటిమిట్టను అభివృద్ధి చేయడంలో తప్పులేదు. భక్తులు రద్దీ పెరిగే కొద్దీ దశల వారీగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ డబ్బులున్నాయని కోట్లకు కోట్లు కుమ్మరించడం బాధ్యత రాహిత్యమే అవుతుంది. శ్రీరాముని మీద ఉన్న భక్తికంటే…ప్రభుత్వ పెద్దల మీద ఉన్న భక్తితోనే ఇదంతా చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 10 ఆలయాలను టిటిడి తన ఆధీనంలోకి తీసుకుంది. ఇవన్నీ రాజకీయ ఒత్తిళ్లతో తీసుకున్నవే తప్ప….నిజంగా టిటిడికి ఆ ఆలయాలపైన శ్రద్ధవుండి కాదు. టిటిడి తీసుకుంటే…ఇక అక్కడ బ్రహ్మోత్సవాలు తప్పని సరి అన్నట్లు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
 
ఇక పురాతన ఆలయాల అభివృద్ధి పేరుతో టిటిడి నుంచి భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. జిల్లాలో ఎక్కడో ఏదో ఆలయానికి చెందిన కోనేరు మరమ్మతులకు టిటిడి నిధులు ఇచ్చింది. ఇంకో ఆలయానికి కొయ్యరథం తయారీ కోసం నిధులు ఇచ్చింది. ఇంకో శాసన సభ్యుడు లేఖ రాశారని…ఆయన నియోజకవర్గంలో ఆలయానికి నిధులు ఇచ్చారు. ఇక టాటా క్యాన్సర్‌ ఆస్పత్రికి రూ.40 కోట్లు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ బర్డ్‌ తరహా ఆస్పత్రి నిర్మిస్తుంటే ప్రభుత్వ హామీ మేరకు రూ.10 కోట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే….లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి.
 
ప్రభుత్వం చేయాల్సిన పనులకూ…
ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన అనేక పనులకు నిధులు కేటాయిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. చెరువుల అభివృద్ధి, జాతీయ రహదారి అభివృద్ధి వంటి పనులకు నిధులు కేటాయించాలని నిర్ణయించిది. రోడ్ల అభివృద్ధికి రూ.210 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో చూపించారు. రోడ్ల కోసం టిటిడి ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటో తెలియదు. తిరుపతిలోని అవిలాల చెరువు అభివృద్ధికి రూ.180 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
 
దుబారా ఖర్చులు
టిటిడి రవావా విభాగం కోసమే ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవంగా పొదుపు చేయాలన్న తలంపు అధికారులకు ఉంటే ఇక్కడే రూ.10 కోట్లు దాకా ఆదా చేయవచ్చు. ఇక ప్రతి పనినీ కాంట్రాక్టుకు ఇచ్చేస్తున్నారు. సొంతంగా చేసుకుంటే కోటి ఖర్చ య్యేదానికి కాంట్రాక్టుకు ఇచ్చి ఒకటిన్నర కోటి ఖర్చు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలు, ఎల్‌ఇడి తెరలు వంటివి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా ప్రతి ఉత్సవానికీ అద్దెకు తెచ్చుకుంటూ కోట్లు వ్యయం చేస్తున్నారు. మొలకల చెరువులో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ ప్లాంటును ప్రైవేట్‌కు ఇవ్వడం వల్ల 20 ఏళ్లలో టిటిడి రూ.100 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి అనేకం ఉన్నాయి.
 
పటిష్టమైన ఆర్థిక విధానం అవసరం
టిటిడికి పటిష్టమైన ఆర్థిక విధానం అవసరం ఉంది. టిటిడి నిధులను దేనికి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలని అనేదానిపై పక్కా విధివిధానాలను రూపొందించుకోవాలి. దుబారాను, అనినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మించి దేవుడి డబ్బులు ఖర్చు చేస్తున్నామన్న స్పృహ పాలక మండలికిగానీ, అధికారులకుగానీ ఉండాలి. డబ్బులున్నాయి కదా అని ఖర్చ పెట్టుకుంటూ వెళితే… భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. టిటిడి బడ్జెట్‌ రూ.3000 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఆడిటింగ్‌ వ్యవస్థ కూడా ఉండాలి. టిటిడి ఆడిటింగ్‌ను కాగ్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఇది కచ్చితంగా టిటిడికి మేలు చేసేదే తప్ప…నష్టం చేసేదికాదు. అందుకే దీన్ని పరిశీలించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహానికి వీధిచూపు వచ్చినప్పుడు...?