కార్యార్థి అయినవాడు సందర్భాన్ని బట్టి మెసలడంలో నేర్పరి అయి వుంటాడు. అతడు వీలునుబట్టి ఒకచోట భూశయనానికి అయినా సిద్ధపడతాడు. పరుపులపై పడుకునే అవకాశం వున్నప్పుడు, దానిని ఉపయోగించుకుంటాడు.
షడ్రషోపేతమైన భోజనం దొరికితే సరే... లేదంటే కాయగూరలతో చేసినవైనా ఆఖరికి పచ్చడి మెతుకులు తింటూ సరిపుచ్చుకుంటాడు. ఒకచోట పట్టుపీతాంబరాలను ధరించగలడు. వేరొకచోట బొంతగుడ్డపైన పడుకోగలడు.
అయితే అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏంటంటే... కష్టాలు కలిగాయని దుఃఖించడమో, సుఖాలు లభించాయని ఆనందించడమో వుండదు అతనికి. నీతివేత్తలైనవారి చేత పొగడబడినా, కొన్ని సందర్భాల్లో వారి చేతనే విమర్శించినా ధీరులు తమ న్యాయమార్గాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వారికి తాము అనుసరిస్తున్న మార్గం న్యాయమైనది అనే స్పృహ వుంటుంది కనుక.
అలాగే సంపదలు వచ్చినా, పోయినా, ఆ క్షణమే ప్రాణం పోతున్నా చాలా కాలం బ్రతికినా న్యాయం మాత్రం తప్పరు వీరు. ప్రశంసలకు, విమర్శలకు, అల్పాయుష్షుకు, అధికాయుష్షుకు న్యాయమార్గానుసారం నడిచేవారు లొంగరు. అదే వారి బలం.