వంటచేసేవారు పరిశుభ్రముగా ఉండాలి. ఆరోగ్యముగా ఉండాలి. వంటచేసేటప్పుడు వారి మనస్సులో ప్రేమ, సద్భావం, శాంతం, శ్రద్ధ ఇటువంటివి స్థిరపడాలి. కామక్రోధాలకు, వైరమునకు, హింస, క్షుద్రసంకల్పాలకు వారి మనస్సులో చోటుండరాదు. వారు జిహ్వచాపల్యానికి లోనుకాకూడదు. వంట చేస్తూ చేస్తూ పదార్థాలను రుచి చూడరాదు. వంట చేసే వారి హృదయంలో ఆత్మీయభావం ప్రేమ, హితాకాంక్ష ఉండాలి. ఇటువంటివారు చేసే వంట రుచికరం.
శ్రీ కృష్ణ భగవానుడు దుర్యోధనుడెంత బలవంతపరిచినా అతనిలో ఆత్మీయత సద్భావం లోపించినందున అతని విందుభోజనాన్ని తిరస్కరించి భక్తిప్రపత్తులుండే విదురునింటికి పోయి సంతృప్తిగా భుజించినాడు.
కన్నతల్లి, కట్టుకొన్న భార్య, తోడబుట్టువు తనపై ఆత్మీయభావంగా చేసే వంట, వడ్డన పరిశుద్దము, పవిత్రము, ఆరోగ్యప్రదము అవుతుంది. వంటవాండ్లకు, నౌకర్లకు అటువంటి ఆత్మీయత, ప్రేమ ఉండవు. వారు డబ్బు మనుషులు. అందువల్ల ఆత్మీయులే వంట చేయవలెను. వారే వడ్డించాలి. అప్పుడే అన్ని విధాల ఆరోగ్యము, ఆనందము, సంతృప్తి కలుగుతాయి.