సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి జిల్లేడాకులతో, రేగిపండ్లతో మునుగుతూ స్నానం చెయ్యాలి. మునిగేందుకు నీటి ప్రవాహం లేనిపక్షంలో తలమీద, భుజాలమీద ఆకునీ, పండునీ పెట్టుకుని తలమీదుగా స్నానం చేయాలి.
సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పునకు ఎదురుగా కూర్చోని ఋగ్వేదమంత్రాలనిగాని (ఋగ్వేద మంత్రాలని ఇష్టంగా వింటాడు కాబట్టే ఆయన అర్కుడయ్యాడు). ఆదిత్య హృదయస్తోత్రాన్ని పన్నెండుమార్లు గాని చదువుతూ కూర్చోవాలి.
ఇంట్లో గృహిణిగాని, లేదా వివాహం కానివారైతే వారి తల్లిగాని ఆగ్నేయదిక్కులో పొయ్యిని పెట్టి ఆవుపిడకలని ఇంధనంగా వాడుతూ ఆవుపాలతో కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యుడు అలా దర్శనమిస్తున్న ఆ మొదటి క్షణంలో ఆయనకి నమస్కరిస్తూ ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యమనేది చివరిగా చేసే వైదికకర్మ కాబట్టి దానికి ముందు లఘువుగా సూర్యునికి ధ్యానం చేసి పూజించాలి.