సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ ఛటేశ్వర్ పుజారాకు తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయింది. మొత్తం 373 బంతులను ఎదుర్కొన్న పుజారా... 22 ఫోర్ల సాయంతో 193 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
గురువారం నుంచి ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు మయాంక్ (77), రాహుల్ (9)లు ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, రాహుల్ తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో బరిలోకి దిగిన పూజారా... ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఫలితంగా తొలిరోజు 200 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 130 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారా... రెండోరోజైన శనివారం మరో 63 పరుగులు జోడించి ఔట్ అయ్యాడు. నిజానికి పుజారా బ్యాటింగ్ జోరు చూస్తుంటే.. తన కెరీర్‌లో మరో డబుల్ సెంచరీ చేస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, 193 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్లకు పుజూరా చుక్కలు చూపించాడు.
ప్రస్తుతం క్రీజ్‌లో రిషబ్ పంత్ (50 బ్యాటింగ్: 85 బంతుల్లో 4x4), జడేజా (1) ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి అర్థ సెంచరీ చేసిన రిషబ్ భారత్ స్కోర్‌ని భారీ దిశగా తీసుకెళుతున్నాడు. అయితే ఈ రోజు ఉదయం పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన హనుమ విహారి (42: 96 బంతుల్లో 5x4) ఈరోజు జట్టు స్కోరు 329 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్స్‌లో నాథన్ లియోన్ మూడు వికెట్స్ తీయగా, హాజిల్ వుడ్‌కి రెండు వికెట్స్ దక్కాయి.