ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొనబడుతోంది. ఈ ఏకాదశి శుక్రవారం, డిసెంబర్ 10, 2020న వస్తోంది. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి తిథి. ఈ ఉత్పన్న ఏకాదశి అంటే.. మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఉపవాసములు ఆచరించాల్సిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి.
శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఉపవాసం వుండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి పొందగలదు. ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లైతే ముక్తిని పొందగలరు.
కార్తీకమాసం శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పండితులు అంటున్నారు. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు.
ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడని ప్రతీతి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తాన, సూర్యాస్తమయం తర్వాత తులసిని, విష్ణువును పూజించినా.. దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఉత్పన్న ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసీ దళాలను నములుతూ వుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.