కార్తీక మాసం శివకేశవులకు విశిష్టమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసివుంటుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనవి.
కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంగళకరం. లేకుంటే ఇంటి వున్న నీటిలోనే స్నానం చేయాలి. దాన్నే గంగాస్నానంగా భావించాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకుని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.
శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించొచ్చు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.
ఇలాచేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని అంటారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.