అప్పుల్లో చాలామంది కూరుకుపోతున్నారు. ఆదాయానికి తగిన ఖర్చులు చేయకుండా.. ఆడంబరానికి అలవాటు పడి అప్పులు చేసుకుంటూ పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి అప్పులు తీరాలంటే.. ఆదాయం కోసం చేసే కృషితో పాటు.. ఈ జ్యోతిష్య పరిహారాలు కూడా పాటించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జాతకంలో అష్టమ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు.. అప్పులు తీసుకోకూడదు.
ఒకరి జన్మ జాతకంలో కాలపురుషుడికి ఆరవ అంశమైన కన్యారాశిలో గురుగ్రహం సంచరిస్తున్నప్పుడు రుణాలు తీసుకోకూడదు. ఇవన్నీ కాకుండా అప్పులు తీరాలంటే.. ఆదివారం రాహు కాలంలో సాయంత్రం 4.30 నుండి 6 గంటల మధ్య భైరవ ఆలయానికి వెళ్లి, తెల్లటి వస్త్రంపై 27 నల్ల మిరియాల గింజలను మూట కట్టి, ప్రమిద దీపంలో వత్తిగా ముడి వేసి, దానిపై నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించి, భైరవుడిని పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత, దీపం చుట్టూ కుంకుమ పువ్వులు చల్లుకోవాలి. ఇలా మూడు వారాల పాటు చేయాలి. ఇలా చేస్తే అప్పులు తీరిపోవడమే కాకుండా ఇతరులకు మీరిచ్చిన రుణాలు కూడా వసూలవుతాయి.
అలాగే ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే సముద్రపు ఉప్పు, మెంతులు, నల్ల నువ్వులను ఒక్కో స్పూన్ తీసుకుని శుభ్రమైన తెల్లటి గుడ్డలో చుట్టి, మీ ఇంటిలోని నైరుతి మూలలో వుంచండి. ఇలా చేస్తే అప్పు కూడా సులభంగా తీరిపోతుంది.
రుణాల నుంచి విముక్తి లభించాలంటే?
తమిళనాడు, కుంభకోణం నుండి దాదాపు 15 కి.మీ. తిరువారూర్ వెళ్ళే దారిలో తిరుచెరైవుడయార్ ఆలయం ఉంది. ఇక్కడ, శివుడు రుణబాధలను నివృత్తి చేసే స్వయంభువుగా వెలసినాడు. ఇది రుణ విముక్తినిచ్చే ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఈ ఆలయంలోని ఈశ్వరునికి చేసే అభిషేకాన్ని కనులారా వీక్షించే వారికి అప్పుల బాధలంటూ వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.