అమావాస్య రోజున తమ పూర్వీకులను, తల్లిదండ్రులను పూజించిన వారికి, వారి భావితరాలకు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడు అమావాస్య రోజు మాత్రమే సంతోషంగా ఉంటాడు. మనోకారకుడైన చంద్రుడు సంతోషంగా ఉంటే మన మనసు కూడా సంతోషిస్తుంది.
మన పూర్వీకులకు చేయగలిగే తర్పణాలను అమావాస్య రోజు శ్రద్ధగా ఇవ్వడం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. సంతోషకరమైన జీవితం ఉంటుంది. అమావాస్య రోజున మనం ఇంటిని శుభ్రం చేసి, ఇళ్లలో దీపాలు వెలిగించి, నువ్వులు, నీళ్లతో మన పూర్వీకులకు స్వాగతం పలికితే సంతోషించి దీవిస్తారు.
అమావాస్య రోజు నువ్వులను నైవేద్యంగా పెడితే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అమావాస్య రోజున వస్త్రదానం చేయడం వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కొత్త బట్టలు దానం చేయడం వల్ల ఆయుష్షు మెరుగుపడుతుంది. దీర్ఘాయువు చేకూరుతుంది. అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది.
అనారోగాల నుంచి బయటపడాలంటే.. అమావాస్య రోజున కంచు పాత్రలో స్వచ్ఛమైన నెయ్యిని దానం చేయాలి. పూర్వీకులను పూజించిన అనంతరం పేదలకు, వికలాంగులకు అన్నదానం చేయడం మంచిది. అమావాస్య నాడు పేదలను, ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయాలి. ఇలా చేస్తే పూర్వీకుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.