నల్లమల అడవుల్లో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకుంటే భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒక ప్రదేశమే గుండ్ల బ్రహ్మేశ్వరం. చుట్టూ అందమైన అడవి గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో ఈ క్షేత్రం ఉంది.
గుండ్ల బ్రహ్మేశ్వరం కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు సరిహద్దు మండలాల్లో నల్లమల అడవుల్లో ఉంది. ఈ ప్రాంతంలో ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ స్వయాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అబ్బుర పరిచే ప్రకృతి సౌందర్యాలతో నిండిన ఈ క్షేత్రంలో, రెండు చిన్న కోనేరులు, గుండ్ల పెంట అనే కోనేరు ఉంటుంది. ఇక్కడ ప్రాచీన విగ్రహాలుంటాయి.
మార్కండేయుడు రచించిన గజారణ్య సంహిత ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ మండలాన్ని నంది మండలాలుగా పిలిచేవారు. ఈ గజారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట.
నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనేచోట పైకెగిరి పగిలిపోయాయి.
ఆ కుండల నుండి జాలువారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. ఆ గుండికా నదే వాడుకలో ''గుండ్లకమ్మ''గా రూపాంతరం చెందింది. గుండికా నదీగా పిలవబడిన ఈ నదీ తీరంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట. ఇక ఈ ప్రాంతాన్ని సందర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.