దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి...? ఆలయాలను సందర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఆలయం అనేది దైవాంశ నిలయం. అది మానవునికి ఆరోగ్య పరంగానూ, మానసిక పరంగానూ మేలు చేసే కొలువు. అలాంటి ప్రదేశానికి చేరుకుని విగ్రహాలను పూజించడం దీపాలను వెలిగించడం ద్వారా అనేక ఫలితాలుంటాయి.
ఆలయాలకు అలా వెళ్ళి ఇలా వచ్చేయడం చేయకూడదు. కనీసం గంటసేపైనా ఆలయంలో కూర్చుని.. మనస్సుని నియంత్రించుకునే శక్తిని పెంపొందించుకోవాలి. ఆలయంలో కూర్చుని గంటపాటు ధ్యానం చేసుకోవడం ఉత్తమం. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మితమైన ఆలయాలు, భూమిని పరిరక్షించే ఆలయాలు, సముద్రతీరాల్లోని ఆలయాలను దర్శించుకోవాలి.
సాధారణంగా గ్రామాల్లో, కొండలపై ఆలయాలు వుండేవి. వీటిల్లో కొండపై వెలసిన ఆలయాలకు శక్తి అధికంగా వుంటుందని పండితులు చెప్తున్నారు. ఆలయానికి మధ్యలో గర్భగుడి వుంటుంది. గర్భగుడిలో వెలసి మూల విరాట్‌కు కింద యంత్రాలు వుంటాయి. శక్తివంతమైన యంత్రాలతో కూడిన శక్తి మూలవిరాట్‌కు విగ్రహానికి కింద వుంటుంది.
ఈ యంత్రాల ప్రభావం మూలవిరాట్‌కు ఇంకా ఆలయ పరిసరాలను కాపాడుతుంది. అందుకే గర్భగుడిలోని స్వామిని దర్శించుకుని.. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసేవారికి ఆ యంత్రాల నుంచి అయస్కాంత శక్తి వ్యాప్తి చెందడంతో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. ఇది భక్తులకు మేలు చేస్తుంది. ఆలయాన్ని 11, 108 సార్లు ప్రదక్షణలు చేయడం ద్వారా శరీరంలోని కొవ్వు శాతం తగ్గిపోతుంది.
ఆరోగ్యం చేకూరుతుంది. ఆ కాలంలో ఆలయాలకు వెళ్లడం, ప్రదక్షణలు చేయడం ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరేవి కావు. ఇంకా ఆలయాల్లోని వేద ఘోషాలు, ప్రార్థనలు, శ్లోకాలను వినడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్తేజం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అదన్నమాట సంగతి.