సాధారణంగా మనల్లో చాలామంది ఆదివారం సెలవు కావడంతో తలంటు స్నానం చేస్తుంటారు. అయితే అలా చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆదివారం పూట నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయడం కూడదు.
శనివారం పూటే నువ్వుల నూనెను తలకు, శరీరానికి పట్టించి.. అభ్యంగన స్నానం చేయడం ఉత్తమం. ఆదివారం గాడిద కూడా నువ్వుల తోట వైపు వెళ్లదని పెద్దలంటారు. అందుచేత తలంటు స్నానానికి ఆదివారం మంచిది కాదు.
ఇక పురుషులు బుధవారం, శనివారం పూట తలంటు స్నానం చేయడం, అభ్యంగన స్నానం చేయడం మంచిది. అలాగే మహిళలు మంగళ, శుక్రవారాల్లో తలంటు స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. ముఖ్యంగా శుక్రవారం తలంటు స్నానం చేసే మహిళలకు ఆయురారోగ్యాలు పెంపొందుతాయి.
ఇకపోతే.. ఉదయం 8 గంటల కంటే ముందు సాయంత్రం ఐదు గంటలకు తర్వాత తలంటు స్నానం చేయకూడదు. శరీరానికి నువ్వులనూనె బాగా పట్టించడం ద్వారా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
పొడిబారిన చర్మానికి తేమ లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత సక్రమంగా లేని పక్షంలో అలసట ఆవహిస్తుంది. నీరసం తప్పదు. అందుకే నువ్వుల నూనెతో వారానికి ఓసారైనా తలంటు స్నానం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.