Gandikota Rahasyam 52 years
గండికోట రహస్యం విడుదలై నేటికి 52 ఏళ్లు. ఎన్టీఆర్., విఠలాచార్య కాంబినేషన్ సినిమాలంటే అప్పట్లో పెద్ద క్రేజ్. సాంకేతికత అంటే ఏమిటో పెద్దగా తెలీని రోజుల్లో విఠలాచార్య సెట్టింగ్‌లకు ప్రత్యేకత వుండేది. ఇక వారిద్దరికిది 7వ సినిమా. 1958లో ఎమ్జీఆర్, భానుమతి, బి.సరోజాదేవి కాంబినేషన్ లో వచ్చిన నాదోడి మన్నన్ దీనికి బేస్. చిత్రమేమిటంటే ఈ నాదోడి మన్నన్ ని తెలుగులో అనగనగా ఒక రాజు పేరుతో డబ్ చేశారు కూడా. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. జయలలిత, దేవిక ఇందులో హీరోయిన్లు. ఎస్. ఎస్. లాల్ ఫోటోగ్రఫీ, టీవీరాజు మ్యూజిక్ హైలైట్ గా ఉంటుంది. మరదలు పిల్లా ఎగిరిపడకు, తెలిసింది తెలిసింది అబ్బాయి గారు, నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా పాటలు బాగా మార్మోగాయి. హిందీలో భగవత్ పేరుతో దీన్ని డబ్ చేశారు.
కథగా చెప్పాలంటే,
గండికోట రాజ్యానికి యువరాజు జయంతుడు (ఎన్టీ రామారావు). పెదనాన్న కుమారుడు ప్రతాప్ (రాజనాల)యువరాజును విషయలోలుని కావించి రాజ్యపాలనా వ్యవహారాలు తెలియనీయకుండా చేసి ఎప్పటికైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేస్తుంటాడు. ఇందుకు సైన్యాధిపతి (ప్రభాకర రెడ్డి)కూడా సహాయం చేస్తుంటాడు. యువరాజు తల్లి, భార్య (దేవిక)రాజ్య పరిస్థితిని చూసి బాధ పడుతూ ఉంటారు. యువరాజుకి పట్టాభిషేకం చేసి రాజ్య భారాన్ని అప్పజెపితేనైనా దారిలోకి వస్తాడేమోనని అందుకు ఏర్పాట్లు చేస్తారు. పట్టాభిషేకానికి ధనసహాయం పేరుతో ప్రతాప్ యువరాజు ఆమోదముద్ర తీసుకుని ప్రజలను పన్నుల కోసం పీడించడం మొదలుపెడతాడు. సామాన్యుడైన రాజా (మరో ఎన్టీ రామారావు )ప్రజల భాదలను చూసి సహించలేక అధికారుల మీద తిరగబడతాడు. వారు తనని బంధించబోతే తప్పించుకుని పారిపోయి రాజుకు ప్రజల పరిస్థితి నివేదించడానికి అంతఃపురంలో ప్రవేశించి రాజుకు పరిస్థితులను వివరించి రాజాభిమానాన్ని చూరగొంటాడు. రాజు తన తప్పును తెలుసుకుని ఇక ప్రజలను ఏ లోటూ రాకుండా చూసుకుంటానని మాట ఇస్తాడు.
పట్టాభిషేకం మరో రోజు ఉందనగా యువరాజు, రాజా ఇద్దరూ కలిసి భోంచేస్తుండగా ప్రతాప్ రాజుమీద విషప్రయోగం జరిపిస్తాడు. ఆ విషం సేవించడం వల్ల రాజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. మహామంత్రి రాజాకి రాజ్యం ప్రతాప్ చేతిలో పడితే ఎంత అల్లకల్లోలమవుతుందో వివరించి యువరాజు స్థానంలో అతన్ని పట్టాభిషేకం చేసుకోమంటాడు. గత్యంతరం లేక రాజా అందుకు అంగీకరిస్తాడు. పట్టాభిషేకానికి రాజా కావాలనే ఆలస్యంగా వస్తాడు. ఈ లోపునే యువరాజు మీద అనేక అభాండాలు వేసి ప్రతాప్ సింహాసనాన్ని అధిష్టించాలని చూస్తాడు. కానీ రాజా చివరి సమయంలో వచ్చి రాజ్యాధికారం చేపడతాడు. పరిపాలనలో మార్పులు చేస్తాడు. ఒకవైపు యువరాజా వారిని రహస్యంగా ఉంచి వైద్యం జరిపిస్తుంటాడు. కొద్దిరోజులకి ప్రతాప్ కి రాజా మీద అనుమానం వచ్చి రహస్యాన్ని కనుక్కుంటాడు. కానీ యువరాజును రాజా ప్రేయసి కాపాడుతుంది కానీ సైన్యాధిపతి చేతిలో చిక్కి బంధీ అవుతాడు. చివరికి ఇద్దరు కథానాయకులు కలిసి ప్రతినాయకులను అంతమొందించి రాజ్యం చేరుకోవడంతో కథ ముగుస్తుంది.