గత ఏడాది క్రిస్మస్ పండుగ నాడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరి మృత దేహాలు ఈరోజు తెల్లవారు జామును అమెరికా నుంచి హైదరాబాదుకు చేరుకున్నాయి.
హైదరాబాదులోని నారాయణపేట చర్చిలో వీరి భౌతిక కాయాలకు ప్రార్థనలు నిర్వహించి అనంతరం శనివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ జిల్లాలోని వారి స్వగ్రామంలో ఖననం చేయనున్నారు.
డిసెంబరు క్రిస్మస్ పండుగ సందర్భంగా అమెరికాలోని కొలిర్ వ్యాలీలోని ఓ ఇంట్లో వీరు దీపాలు వెలిగించి వుంచారు. ఆ తర్వాత వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రి గాఢ నిద్రలో వుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా వీరిలో తెలంగాణకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయ్ సుచితలుగా గుర్తించారు.