ఏ పనినైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా; విజయదశమినాడు చేపట్టిన ఏకార్యము అయినా విజయముతధ్యము అని 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంథము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఆ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని గురువాక్యము.
ఇంకా దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్త దినం ఈ విజయదశమి రోజునే అని తెలియజేయబడింది. "శ్రవణా" నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి "విజయా" అనే సంకేతము ఉన్నది. అందుకనే దీనికి "విజయదశమి" అను పేరు వచ్చినది.
ఈ విజయదశమినాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలుచుకుని పేరంటం పెట్టుకొని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.
అలాంటి విజయ దశమి రోజు మరింత ముఖ్యమైనది "శమీపూజ". శమీవృక్షమంటే "జమ్మిచెట్టు" అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తిఅవగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న "అపరాజితా" దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు. తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారంకూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో;
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అని ఆ చెట్టుకు ప్రదక్షణలుచేస్తూ పై శ్లోకము స్మరిస్తూ ఆ శ్లోకములు వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగ, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
ఇలా మానవులు అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలన్నా మనకు ఏర్పడిన దారిద్ర్యం తొలగిపోవాలన్నా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై. ఈ "శరన్నవరాత్రి" దసరావైభవంలో పాలుపంచుకుని సర్వులూ పునీతులు అవుదురుగాక...!