Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:51 IST)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.  ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్‌ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.  ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

దసరా అంటేనే బెజవాడలో ఒక పండుగ..ఇంద్రకీలాద్రి తో పాటు నగరం మొత్తం విద్యుత్ కాంతులతో విరజిల్లుతోంది. ప్రతీ  ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి పై పండుగ శోభ సంతరించకుంటుంది.

సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 8 వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా  కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు.

దాదాపు 7 కోట్ల వ్యయంతో అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.  5700 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయశాఖ సిబ్బంది, 350 మంది సెక్యురిటీ సిబ్బంది, 900 మంది వాలంటరీస్ దసరా లో విధులు నిర్వర్తించబోతున్నారు.

29వ తేదీన అమ్మవారు తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. పదిరోజులు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుండడం.. మొదటిరోజు తర్వాతి రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది.

మరోవైపు అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పించనున్నారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది.

అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశారు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనాలే కేటాయించారు. దసరా రాష్ట్ర పండుగ కావడంతో  రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక, విపత్తుల నివారణ, దేవదాయ, మత్స్య, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్ చార్జి మంత్రి కన్నబాబు ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ప్రతి రోజూ  మోడల్ గెస్ట్ హౌస్ వద్ద కంట్రోల్ రూం నుంచి రివ్యూ లు జరిపి భక్తులకు మెరుగైన సౌకర్యాలుకల్పించనున్నారు. అదేవిధంగా వినాయకుడి గుడి నుంచి అమ్మవారి దర్శనానికి నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూం ఫిర్యాదు చేస్తే స్పాట్ లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు.

అదేవిధంగా దసరా కు దుర్గగుడి అధికారులు ఎంత పెడితే మిగతా ఉత్సవాల ఖర్చంతా ప్రభుత్వమే బరాయిస్తుందంటున్నారు మంత్రులు... కన్నబాబు ( జిల్లా ఇన్ చార్జి మంత్రి), వెలంపల్లి శ్రీనివాసరావు ( దేవాదాయశాఖమంత్రి). మరోవైపు విజయదశమి రోజు ఉత్సవాల ఆఖరి రోజైన అక్టోబర్‌ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల  పండువగా జరపనున్నారు.

హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమం నిర్వహిస్తారు. అలాగే నిత్యం నగరోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సురేష్ బాబు చెప్పారు.

అర్జున వీధిలోని దేవస్థానం అన్నదాన సత్రంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చన్నారు. అదేవిధంగా విఐపిలకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 9 గంటలవరకు మాత్రమే రావాలని, మిగిలిన సమయాల్లో వచ్చి భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని కోరుతున్నారు. 

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో మంచినీటి, మజ్జిగతో పాటు దర్శనాంతరం లడ్డు, పులిహోర విక్రయాల్లో లోటుపాట్లు లేకుండా  అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. అమ్మవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.

ఏదిఏమైనప్పటికీ దసరా ఉత్సవాల పది రోజులు లక్షల్లో వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలంటే అధికారులకు కత్తి మీద సామే... వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పండుగ కాబట్టి దసరా ను ఘనంగా నిర్వహిస్తుందా లేక వివాదాలను మూటగట్టుకుంటుందా వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-09-2019- శనివారం రాశిఫలాలు - ఆర్థిక విషయాల్లో కొంత...