ఆన్‌లైన్‌లో లోన్ యాప్‌ల మోసం రోజు రోజుకీ పెరిగిపోతోంది. లోన్ యాప్‌ల జోలికి వెళ్తే.. నిజాయితీగా డబ్బులు కట్టేసినా వారికి కష్టాలు తప్పవు అనే దానికి ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడు తిరువారూరు జిల్లాలో ఆన్‌లైన్‌లో రుణం తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
వివరాల్లోకి వెళితే.. తిరువారూరు జిల్లా వలంగైమాన్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో రుణం చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే.. మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన లోన్ కంపెనీ.. రాజేష్ న్యూడ్ ఫోటోను మార్ఫింగ్ చేసి అతడి బంధువులు, స్నేహితులకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.