ప్రస్తుతం మన దేశంలో నిజం మాట్లాడితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, వాస్తవాలను మాట్లాడేవాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ రౌత్ తప్పుపట్టారు. గత ఆరేళ్ల నుంచి అబద్ధాలనే వింటున్నామని, వాటిని నిజాలుగా వల్లిస్తున్నారని, ఈ రోజుల్లో ఎవరు నిజం మాట్లాడినా.. వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ రైతులు.. దేశవ్యాప్త రైతుల కోసం ఉద్యమం చేస్తున్నారని, వారేమీ దేశద్రోహులు కాదన్నారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్, ఎంపీ శవిథరూర్‌లను ఎందుకు దేశద్రోహులంటున్నారో ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరికాదు అని, జనవరి 26వ తేదీన జరిగిన ఘటనల పట్ల సిగ్గుపడాల్సి వస్తోందని, ఆ దాడికి కారణమైన దీప్ సిద్దూ ఎవరు అని ఎంపీ సంజయ్ ప్రశ్నించారు.
జనవరి 26వ తేదీ నుంచి అనేక మంది రైతులు మిస్సవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏదైనా ఎన్‌కౌంటర్‌లో ఆ రైతులను పోలీసులు చంపేశారా ఏమో అన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జాతీయవాదులు ఎవరు.. అర్నాబ్ గోస్వామియా లేక కంగనా రనౌతా? ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను గోస్వామి ఉల్లంఘించారని, బాలాకోట్ దాడుల గురించి ఆయనకు ముందే తెలిసిందని, కానీ ఆయనకు మీ ప్రభుత్వం రక్షణ ఇస్తోందన్నారు.