కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నమ్మినబంటు అయిన అహ్మద్ పటేల్ చనిపోయారు. నెల రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అహ్మద్ పటేల్ తనకు గొప్ప స్నేహితుడని, ఆయన అకాల మరణవార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.
ఈ మేరకు ఆయన మీడియాకు ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మన్మోహన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆహ్మద్ పటేల్‌ను కోల్పోయిన అతని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే, శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ, రెండు రోజుల క్రితమే తాను అహ్మద్ పటేల్ కుటుంబసభ్యులను కలిశానని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సైతం వారితో మాట్లాడారని సంజయ్ రౌత్ చెప్పారు. అహ్మద్‌పటేల్‌ను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలిద్దామని వారికి చెప్పామని, అయితే ఇంతలోనే ఆయన మరణవార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అహ్మద్ పటేల్ మరణం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక మూలస్తంభాన్ని కోల్పోయిందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆయన విశ్వాసానికి మారుపేరని, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీకి నమ్మినబంటుగా ఉండటం ఎలాగో ఆయనను చూసి నేర్చుకోవాలన్నారు. అహ్మద్ పటేల్ ఒక సంస్కారవంతుడైన రాజకీయ నాయకుడని రౌత్ కొనియాడారు.