తల్లి వృద్ధాప్య పెన్షన్ కోసం ఓ కుమార్తె చేసిన పనికి బ్యాంకు అధికారులే విస్తుపోయారు. తన తల్లికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలంటూ పదేపదే మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో 120 యేళ్ల వయస్సున్న తన తల్లిని ఆ మహిళ ఏకంగా బ్యాంకు వద్దకే తీసుకొచ్చింది. అదీ కూడా మంచంపై పడుకోబెట్టుకుని బ్యాంకు వరకు ఈడ్చుకొచ్చింది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని నౌపద జిల్లాలో వెలుగు చూసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నౌపద జిల్లాలో ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే 120 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మంచానపడింది. వృద్ధురాలైన లాభీ బాగేల్ తనకు రావాల్సిన 1500 రూపాయల పించన్ తీసుకురమ్మని తన కుమార్తె అయిన గుంజాదేవిని బ్యాంకుకు పంపించింది.
బ్యాంకు అధికారులు తల్లికి ఇవ్వాల్సిన పెన్షన్ కూతురికి ఇవ్వమని, ఫిజికల్ వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు తీసుకురావాలని కోరారు. దీంతో చేసేదిలేక 70 ఏళ్ల గుంజాదేవి తన 120 ఏళ్ల వయసుగల తల్లిని మంచంపైనే పడుకోబెట్టి ఏకంగా మంచాన్నే బ్యాంకుకు లాక్కొచ్చింది. బ్యాంకుకు తీసుకువచ్చిన వృద్ధురాలితోపాటు కూతుర్ని చూసిన బ్యాంకు అధికారులు పెన్షన్ డబ్బును విడుదల చేశారు.
హృదయవిదారకమైన ఈ ఘటన వీడియో ట్విట్టర్ లో పెట్టడంతో రూ.1500 పెన్షన్ ఇచ్చేందుకు ఇద్దరు వృద్ధ మహిళలను ఇబ్బంది పెట్టిన బ్యాంకుఅధికారులపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ ఘటనతో వృద్ధులకు పెన్షన్‌ను ఇంటివద్దే అందించాలని బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ చౌదరి అన్ని బ్యాంకుల మేనేజర్లకు లేఖలు రాశారు.