తీహార్ జైల్లో ఉన్న ప్రియుడుతో గంటల కొద్దీ డేటింగ్ చేసిన ప్రియురాలు...

గురువారం, 15 ఆగస్టు 2019 (10:10 IST)
తన ప్రియుడు తీహార్ జైల్లో ఉండటాన్ని ప్రియురాలు జీర్ణించుకోలేక పోయింది. అతను జైల్లో, తాను బయట ఉండలేక పోయింది. ఎలాగైనా తన ప్రియుడు చెంతనే ఉండాలని ఉండాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఓ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. దీంతో ఆమె తన ప్రియుడుతో కలిసి తీహార్ జైలు గదిలో గంటల కొద్దీ డేటింగ్ చేసింది. అయితే, ఈ విషయం చివరకు బయటకు పొక్కడంతో ఆమె బండారం బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణంగా దేశంలో ఉన్న జైళ్ళలన్నింటిలో తీహార్ జైలు ఒకటి. ఇక్కడ ఎంతో మంది ఉగ్రవాదుల నుంచి, కరుడుగట్టిన నేరస్థుల వరకూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, అదే జైలులో ఉన్న తన ప్రియుడు హేమంత్‌ ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. తరచూ కలుసుకునేందుకు ఓ యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. 
 
తన ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన ఆమె, హేమంత్ ప్లాన్ మేరకు, తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్‌గా నమ్మబలికి తొలుత జైలు లోపలికి రావడం ప్రారంభించింది. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఆమె వస్తోందని నమ్మిన అధికారులు, తొలుత అనుమతించేవారు. 
 
అదేసమయంలో ఆ జైలులో పని చేసే ఓ ఉన్నతాధికారితో ఆమె స్నేహం ప్రారంభించింది. ఆయనతో చాలా సన్నిహితంగా మెలగసాగింది. ఈ క్రమంలో జైల్లోని ప్రియుడిని అడ్డూ అదుపూ లేకుండా కలిసేది. గంటల తరబడి అతనితో గడిపేది. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
 
ఆమెకు దగ్గరగా ఉన్న జైలు అధికారిపైనా, ఆమె మాటలను జైలు సిబ్బంది ఎలా నమ్మారన్న విషయంపైనా విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. జరిగినది తీవ్రమైన నిర్లక్ష్యమని, విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, రిపోర్టు రాగానే కఠిన చర్యలు చేపడతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. సీమ వాసి అరెస్టు