మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సెంట్రల్ జైలు అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైల్లో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుద చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
గ్వాలియర్‌లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించారు.
అప్పటి నుంచి గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవల దారా భార్య, కుటుంబసభ్యులు జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని దారా భార్య అభ్యర్థించింది.
దీనిపై సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ.. ఆ మహిళ దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర జైలు నిబంధనల ప్రకారం.. జీవితఖైదు పడిన దోషి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ పొందే అవకాశముందని జైలు అధికారులు తెలిపారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.