Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి అమెరికాలో కరోనా టీకాలు ... ట్రంప్‌కు ఇవ్వనున్న వైద్యులు

నేటి నుంచి అమెరికాలో కరోనా టీకాలు ... ట్రంప్‌కు ఇవ్వనున్న వైద్యులు
, సోమవారం, 14 డిశెంబరు 2020 (08:03 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, ఇప్పటికే బ్రిటన్‌లో ఈ టీకాల పంపిణీ జరుగుతోంది. అలాగే, అగ్రరాజ్యం అమెరికాలో సోమవారం నుంచి అత్యవసర వినియోగం కింద టీకాల పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు కూడా టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
అమెరికాలో సోమవారం నుంచి ఫైజర్‌ కరోనా వాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, పెన్స్‌లు త్వరలో వ్యాక్సిన్‌ తీసుకోనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వైట్‌హౌస్‌ సిబ్బందికి, అత్యున్నత ప్రభుత్వాధికారులు కూడా రానున్న పది రోజుల్లో టీకా తీసుకుంటారని పేర్కొన్నాయి. అయితే, ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదా? అన్నది తెలియలేదు. 
 
ఇదిలావుంటే, అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగించడానికి యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అడ్వైజరీ ప్యానల్‌ శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో మిషిగన్‌లోని ఫైజర్‌ అతిపెద్ద కర్మాగారం నుంచి వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. టీకా సరఫరా కోసం దేశంలో 145 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
తొలి విడతలో అమెరికావ్యాప్తంగా 30 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్‌ హోమ్‌లలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి డోసు తీసుకున్న వారందరికీ మూడు వారాల తర్వాత రెండో డోసు సరఫరా చేస్తారు. దేశంలో ఇప్పటివకు కరోనా వల్ల 2,98,000 మంది మరణించారు. 
 
ఇదిలావుంటే, దేశంలో మొదటి టీకాను 24 గంటల్లోపు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఫెడెక్స్‌, యూపీఎస్‌ భాగస్వామ్యంతో ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను రవాణా చేయడం ప్రారంభించామన్నారు. 
 
మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని తెలిపారు. వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. దీనివల్ల కరోనా మరణాలు, కేసులు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.  
 
ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దేశంలో గత మంగళవారమే వ్యాక్సినేసన్‌ను కూడా ప్రారంభించారు. 90 ఏళ్ళ బామ్మకు తొలి టీకాను ఇచ్చారు. అయితే అల‌ర్జీ ఉన్న వాళ్లు ఆ టీకాను వేసుకోవ‌ద్దని బ్రిట‌న్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం