మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా, సత్పూర రిజర్వులో ఉన్న ‘మ్యాజికల్ మాహూయ’ అనే చెట్టుని ఒక్క సారి టచ్ చేస్తే చాలు ఎంతటి ప్రాణాంతకమైన జబ్బైనా ఇట్టే నయం అయిపోతుంది.
అది అక్కడి జనంలో ఒక నమ్మకం. ఈ నమ్మకంతో ఈ చెట్టు ఎంత ఫేమస్ అయ్యిందంటే… ఐసీయూలో ఉన్న పేషెంట్లు కొందరు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఆసుపత్రి నుంచి నేరుగా ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఈ చెట్టుని స్పర్శించి తమ రోగాల్ని నయం చేసుకోవాలని క్యూ కడుతున్నారు.
రోజుకి పాతిక నుంచి ముఫ్ఫై వేల మంది నాయగావున్ గ్రామంలో ఉన్న ఈ చెట్టుని తాకడానికి వస్తున్నారు. ఈ రద్దీ రోజురోజుకూ పెరిగి పోతుండటంతో…బందోబస్తు ఓ పెద్ద సమస్యగా మారింది పోలీసులకు.
ఇంతకీ ఈ నమ్మకం ఎలా ప్రబలిందంటే… ఒక స్థానిక రైతు, పేరు రూప్ కుమార్ సింగ్. ఈ చెట్టుని ముట్టుకోగానే తన కుంటికాలు చక్కపడిందని చెప్తూ ఒక వీడియోని ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్తో రికార్డు చేయించాడు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది చూసిన జనం ఎక్కడెక్కడినుంచో ఈ చెట్టుని టచ్ చేయడం కోసం తండోపతండాలుగా వస్తున్నారు.
విడ్డూరం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న రైతు అక్కడి గ్రామం నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఇదంతా కేవలం సులువుగా డబ్బులు సందించడానికి ఆ గ్రామ ప్రజలు అల్లిన ఒక కట్టుకథ అని నమ్ముతున్నారు.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే పది లక్షల మంది రోగులు ఈ మహిమ గల చెట్టుని టచ్ చేయడానికి రావడం విశేషం. పూజలు, పునస్కారాలు, దర్శనాలు అంటూ ఈ అటవీ ప్రాంతంకి వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు.
ఈ సందర్భంలోనే 11 మంది కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. ఈ చెట్టుని తాకితే తన రోగం నయం అవుతుందనే ఆశతో ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బుధవారం రోజు ఆ ప్రదేశానికి వచ్చి చచ్చిపోయాడు.
ఈ చెట్టు కు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో అమ్ముడుపోతున్నాయి అంటే జనాలు ఈ చెట్టుని ఎంతగా మూఢంగా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నో న్యూస్ ఛానల్ లు ఈ చెట్టుకి మహిమ లేదు అని చెప్పినప్పటికీ ఈ చెట్టుని ముట్టుకోవడానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.