తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. శోభనం గదిలో భార్య హత్యకు గురికాగా, భర్త ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా మీంజూరులో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీంజూరుకు చెందిన నీతావాసన్ (24), సంధ్య(20) అనే యువతీ యువకులు సమీప బంధువులు. వీరికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో బుధవారం ఉదయం వీరికి వివాహం జరిగింది.
అదే రోజు రాత్రి ఈ నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో ఆమె శోభనం గదిలోకి అడుగుపెట్టింది. సుఖ, సంతోషాలతో గడపాల్సిన ఆ సమయంలో.. భార్యతో భర్త గొడవ పెట్టుకున్నాడు. తొలిరాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం హత్య దాకా దారితీసింది.
ఆవేశంలో భార్యను గునపంతో పొడిచి చంపాడు భర్త. అనంతరం ఇంటికి సమీపంలోని చెట్టుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నూతన దంపతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.