మహిళలపై కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లిన మహిళలపై కూడా వేధింపులు జరుగుతున్నాయి.
తాజాగా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వలస కార్మికురాలిపై స్థానిక సర్పంచి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సువర్ణపూర్ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో ఆదివారం చోటుచేసుకుంది. సంబంధిత బాధిత యువతి సర్పంచిపై ఆరోపణలు చేస్తూ తనకు న్యాయం చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. జూన్ 1వ తేదీన తమిళనాడు నుంచి కొంతమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సువర్ణపూర్ జిల్లాకు చెందిన ఆయాప్రాంతాల క్వారంటైన్ కేంద్రాలకు పంపారు. ఇందులో అందారిబంచి క్వారంటైన్‌లో ఉన్న ఓ యువతికి ప్రత్యేక గది కేటాయించారు.
స్థానిక సర్పంచి బనమాలిషా రోజూ రాత్రిపూట మద్యం తాగి కేంద్రానికి వచ్చి తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.