Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తికాయత్‌ కంటి నీరుతో మారిపోయిన పరిస్థితి... మహాసముద్రంలా రైతులు

తికాయత్‌ కంటి నీరుతో మారిపోయిన పరిస్థితి... మహాసముద్రంలా రైతులు
, ఆదివారం, 31 జనవరి 2021 (10:53 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు రాజస్థాన్ రాష్ట్రంలోని గుజ్జర్ల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు గుజ్జర్‌ సమాజ్‌ శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. రైతుల కన్నీళ్లు తుఫానుగా మారతాయని సమాజ్‌ నేత మదన్‌ భయ్యా అందులో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ కంటి నీరుతో పరిస్థితి మారిపోయిందని ఆయన చెప్పారు. తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్దపడ్డ తికాయత్‌ ఈ దేశపు రైతులకు కొత్త శక్తినీ, చైతన్యాన్నీ కలిగించారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ఆందోళనతో బీజేపీకి అంతిమ ఘడియలు సమీపించాయని ఆజాద్‌ సమాజ్‌ వ్యవస్థాపక సభ్యుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అన్నారు. మద్దతునిచ్చి గెలిపించిన రైతులపైనే బీజేపీ ప్రభుత్వం దమన కాండకు పాల్పడిందని ఆయన విమర్శించారు.
 
మరోవైపు, రాకేశ్‌ తికాయత్‌ ఏడుస్తున్న దృశ్యాలతో జాట్‌ ప్రజలు చలించిపోయారని, అతనికోసం ఏకమయ్యారని వార్తలు వెలువడుతున్నాయి. తికాయత్‌ కుటుంబానికి పశ్చిమ యూపీలో బలమైన మద్దతు ఉన్నదని, 84 గ్రామాలకు చెందిన ఖాప్‌ పంచాయతీకి వారు నాయకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. 
 
రైతులకు మద్దతుగా ఐఎన్‌ఎల్‌డి ఎమ్మెల్యే అభయ్‌ చౌతాలా తన పదవికి రాజీనామా చేయడంతో హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. హర్యానాలో 90 సీట్లలో బీజేపీ 40 సీట్లు గెలుచుకోగా అభయ్‌ చౌతాలా తమ్ముడు దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జెపిపి (జననాయక్‌ జనతా పార్టీ) 10 సీట్లు గెలుచుకుని మనోహర్‌ ఖట్టార్‌ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు.. ‘ఈ ఉద్యమం రైతుల గౌరవానికి భంగకరం, అది ఎలాంటి ఫలితం లేకుండా ముగిస్తే రైతుల ఉనికే దెబ్బతింటుంది, మనం జీవితంలో బీజేపీకి ఓటు వేయవద్దు..’ అని రాకేశ్‌ తికాయత్‌ సోదరుడు నరేశ్‌ తికాయత్‌ పిలుపివ్వడం బీజేపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడివాడ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 2న నామినేషన్ల స్వీకరణ